Rajababu Singh : ప్రతి పోలీస్ ట్రైనీ రామచరిత మానస్ ను జపించాలని – రాజబాబు సింగ్
Rajababu Singh : ‘‘రామచరితమానస్’’ (Ramcharitmanas)గ్రంథాన్ని రాత్రి పడుకునే ముందు ఒకటి రెండు అధ్యాయాలు పఠించమని సూచించారు
- By Sudheer Published Date - 11:48 AM, Thu - 24 July 25

మధ్యప్రదేశ్ లోని పోలీస్ శిక్షణా కేంద్రాల్లో కొత్తగా నియమించబడిన కానిస్టేబుళ్లకు తొమ్మిది నెలల ప్రాథమిక శిక్షణ కోర్సు (Madhya Pradesh Police Training Centres) నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలు కేంద్రాల్లోని శిక్షణార్థులు తమ ఇంటికి దగ్గరగా శిక్షణ తీసుకోవాలంటూ PTS (Police Training School) మార్పు కోసం దరఖాస్తులు సమర్పించారు. దీనిపై రాష్ట్ర శిక్షణా అదనపు డైరెక్టర్ జనరల్ రాజబాబు సింగ్ స్పందించారు. ఆయన శిక్షణార్థులకు రాముడు 14 సంవత్సరాలు అడవిలో గడిపాడని ఉదాహరణ ఇచ్చారు. అది గుర్తు పెట్టుకుని తమ శిక్షణపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
ఈ సందర్భంగా రాజబాబు సింగ్ మాట్లాడుతూ.. ‘‘రామచరితమానస్’’ (Ramcharitmanas)గ్రంథాన్ని రాత్రి పడుకునే ముందు ఒకటి రెండు అధ్యాయాలు పఠించమని సూచించారు. ఇది జీవన విలువల పాఠాలను అందించే మేలైన ధార్మిక గ్రంథమని పేర్కొన్నారు. రాముడి జీవితం నుండి స్ఫూర్తి పొందేలా శిక్షణార్థులు ఆధ్యాత్మికతను అలవరచుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది వారికి జీవిత విధానంలో మంచి మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు.
KTR Birthday : కేటీఆర్ కు బర్త్ డే విషెష్ తెలిపి అందరి నోర్లు మూయించిన కవిత
తాజాగా అమలులోకి వచ్చిన క్రిమినల్ చట్టాల నేపథ్యంలో పోలీస్ శిక్షణా కోర్సులో కొన్ని సాంకేతిక అంశాలను చేర్చినట్లు రాజబాబు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎనిమిది శిక్షణా కేంద్రాల్లో రేవా, ఉమారియా, పచ్చమఢి, ఇండోర్, ఉజ్జయినీ, భౌరి-భోపాల్, సాగర్, టీఘ్రా-గ్వాలియర్ లలో సుమారు 4000 మంది కొత్త కానిస్టేబుళ్లకు శిక్షణ మొదలైంది. అయితే శిక్షణ కేంద్రం మార్పుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించగా, ఎక్కువగా కుటుంబ సమస్యలు, తల్లి అనారోగ్యం వంటి కారణాలు చూపించినట్టు తెలుస్తోంది.
భౌరి (భోపాల్) శిక్షణా కేంద్రానికి చెందిన శిక్షణార్థి రవికుమార్ తివారీ మాట్లాడుతూ.. ADG సర్ చెప్పిన రామచరితమానస్ సూచన మనసుకు హత్తుకుందన్నారు. “రాముడు తన తండ్రి ఆజ్ఞ మేరకు 14 సంవత్సరాలు అడవిలో గడిపాడు. మరి మనం దేశం, రాష్ట్రం కోసం కేవలం 9 నెలలు శిక్షణ కేంద్రంలో గడపలేమా?” అని ఆయన అడిగిన ప్రశ్న ఉదాత్తంగా ఉందన్నారు. రామచరితమానస్‌లోని బోధనలను అనుసరించడం శుభ సూచకమని, శిక్షణార్థులందరూ కలసి ఈ పఠనాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
మొత్తంగా శిక్షణతో పాటు నైతిక విలువలను అలవరచుకునే ప్రయత్నంగా ఈ నిర్ణయం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.