Wayanad Bypoll : అన్న స్థానంలో చెల్లి..
ఇప్పుడు మొదటిసారి ఎన్నికల బరిలో నిలువబోతుంది. వయనాడ్ ఉపఎన్నికలో ఎంపీగా పోటీ చేయనున్నారు
- By Sudheer Published Date - 08:35 PM, Mon - 17 June 24

వయనాడ్ (Wayanad ) ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పోటీ చేసేందుకు సిద్ధం అవుతుంది. 2019 నుంచి కాంగ్రెస్‌లో ప్రియాంక క్రియాశీలకంగా ఉంటున్నప్పటికీ.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. కొన్నేళ్ల క్రితం జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. కానీ అలా జరగలేదు. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె కచ్చితంగా పోటీ చేస్తారని కాంగ్రెస్ శ్రేణులు కూడా భావించారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేయాలని, తన మనసులో మాట కూడా బయటపెట్టారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. కానీ ప్రియాంక గాంధీ పోటీ చేయలేదు. కానీ ఇప్పుడు మొదటిసారి ఎన్నికల బరిలో నిలువబోతుంది. వయనాడ్ ఉపఎన్నికలో ఎంపీగా పోటీ చేయనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, కేరళలోని వయనాడ్ నుంచి బరిలోకి దిగిన రాహుల్ గాంధీ.. రెండు స్థానాల్లోనూ 3 లక్షలకు పైగా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ క్రమంలోనే రెండు స్థానాల్లో ఎంపీగా కొనసాగడానికి వీలు లేదు కాబట్టి.. ఏ స్థానాన్ని వదులుకోవాలా అని ఇన్ని రోజులు రాహుల్ గాంధీ తీవ్రంగా ఆలోచించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వయనాడ్ స్థానానికి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్ ప్రకటించారు. ఇక ఖాళీ కానున్న వయనాడ్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో తన సోదరి ప్రియాంకా గాంధీ వాద్రాను బరిలోకి దించనున్నట్లు రాహుల్ గాంధీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దీంతో ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రానికి సమయం వచ్చేసింది.
ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతూ.. వయనాడ్ నియోజకవర్గాన్ని వదులుకోవాలని తాను ఈ నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమైన పని అని పేర్కొన్నారు. 2019, 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో వయనాడ్ ప్రజలు తనను గెలిపించారని.. ఇప్పుడు ఆ స్థానాన్ని వదులుకోవడం చాలా కఠినమైన నిర్ణయం అని రాహుల్ గాంధీ వెల్లడించారు. వయనాడ్ స్థానాన్ని వదులుకోవడానికి తాను ఎంతో మదనపడ్డానని, అక్కడి ప్రజలతో తన బంధం భవిష్యత్‌లో కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Read Also : Harish Rao : కాంగ్రెస్ పార్టీ పై నిప్పులు చెరిగిన హరీష్ రావు..