Venkaiah Naidu: రాష్ట్రపతిగా వెంకయ్యకే ఎక్కువ అవకాశం
దేశంలో రాష్ట్రపతి ఎన్నికల వేడి ప్రారంభం అయ్యింది.
- Author : Hashtag U
Date : 14-05-2022 - 7:35 IST
Published By : Hashtagu Telugu Desk
దేశంలో రాష్ట్రపతి ఎన్నికల వేడి ప్రారంభం అయ్యింది. అధికార ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చే వీలుందని పలు వార్తలు ఢిల్లీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఒక వేళ అదే నిజం అయితే దాదాపు అయిదు దశాబ్దాల క్రితం నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి అయిన తర్వాత మళ్లీ ఆ పదవి వెంకయ్యనాయుడును వరించినట్లు అవుతుంది.
అటు బీజేపీలో సైతం పలు పేర్లు వినిపిస్తున్నాయి. యూపీ గవర్నర్ అనందిబెన్ పటేల్ రాష్ట్రపతి రేసులో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఆమె గతంలో గుజరాత్ సీఎం గా కూడా పనిచేశారు.
2007లో మహిళా రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ తరువాత మళ్లీ మరో మహిళకు అవకాశం దక్కలేదు. దీంతో బీజేపీ మరోసారి రాష్ట్రపతి పదవికి మహిళను పరిశీలిస్తుందా, అనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే దళిత వర్గానికి చెందిన రాంనాథ్ కోవింద్ కు రాష్ట్రపతి పదవి ఇచ్చారు. దీంతో ఈ సారి రాష్ట్రపతి పదవి దళితులకు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. కాగా ఈ సారి బీజేపీ దక్షిణాదికి చెందిన నేతకు రాష్ట్రపతి పదవి ఇచ్చేందుకు మొగ్గు చూపే అవకాశం ఉంది. తెలంగాణలో ఇప్పటికే కేసీఆర్ బీజేపీతో కయ్యం అంటున్నారు. మరి ఇక బీజేపీ ఏపీలోని వైసీపీనే ఎక్కువగా నమ్ముకుంది.
ఇక ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అయితే దక్షిణాదికి చెందిన వాడితో పాటు, అజాత శత్రువుగా పేరుంది. ఆయన గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. కర్ణాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాజకీయాలతో ఆయనకు ప్రత్యక్ష అనుభవం ఉంది. మరి ఈ రకమైన ఈక్వేషన్స్ పనిచేస్తే తప్పకుండా కొత్త రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి.