ట్రంప్ కార్యక్రమంపై కాల్పుల ఘటన.. స్పందించిన ప్రధాని మోదీ
ముందుగా కార్యక్రమాన్ని కొనసాగించాలని తాను సూచించినప్పటికీ భద్రతా కారణాల దృష్ట్యా చట్ట అమలు సంస్థల సూచనలను పాటిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
- Author : Gopi
Date : 26-04-2026 - 12:50 IST
Published By : Hashtagu Telugu Desk
PM Modi: వైట్ హౌస్ డిన్నర్ ప్రోగ్రామ్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో జరిగిన కాల్పుల ఘటనపై భారత్ తొలిసారిగా స్పందించింది. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, ఈ ఘటనను ఖచ్చితంగా ఖండించాల్సిందేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ.. వాషింగ్టన్ డీసీలోని ఒక హోటల్లో జరిగిన భద్రతాపరమైన ఘటన తర్వాత అధ్యక్షుడు ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా, వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ సురక్షితంగా ఉన్నారని తెలిసి ఊరట చెందాను. వారు ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు. ఇలాంటి దాడులను తీవ్రంగా ఖండించాలని రాశారు.
రంగంలోకి దిగిన సీక్రెట్ సర్వీస్
వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్లో కాల్పులు జరిగిన సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెలానియా ట్రంప్ వేదికపైనే ఉన్నారు. ఒక్కసారిగా తుపాకీ శబ్దం వినిపించడంతో అక్కడ గందరగోళం నెలకొంది. ప్రజలు భయంతో అటుఇటు పరుగులు తీశారు. ఈ ఘటనపై డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా స్పందించారు. దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన ధృవీకరించారు. పరిస్థితిని చాకచక్యంగా హ్యాండిల్ చేసిన సీక్రెట్ సర్వీస్, భద్రతా సంస్థలపై ఆయన ప్రశంసలు కురిపించారు. వాషింగ్టన్ డీసీలో ఇదో భయంకరమైన సాయంత్రం. సీక్రెట్ సర్వీస్, ఇతర ఏజెన్సీలు అద్భుతమైన పనితీరును కనబరిచాయి అని ట్రంప్ పేర్కొన్నారు.
Also Read: వైభవ్ సూర్యవంశీ ఖాతాలో రికార్డులే రికార్డులు!
వాయిదా పడిన కార్యక్రమం
ముందుగా కార్యక్రమాన్ని కొనసాగించాలని తాను సూచించినప్పటికీ భద్రతా కారణాల దృష్ట్యా చట్ట అమలు సంస్థల సూచనలను పాటిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అధికారులతో మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమానికి త్వరలోనే కొత్త తేదీని నిర్ణయిస్తామని ఆయన వెల్లడించారు. వచ్చే 30 రోజుల్లోపు ఈ ఈవెంట్‌ను తిరిగి నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.