PM Modi : బంగ్లాదేశీయులు, రొహింగ్యా చొరబాటుదార్లతో ఆ పార్టీలు చేతులు కలిపాయ్ : ప్రధాని మోడీ
జంషెడ్ పూర్‌లోని గోపాల్ మైదాన్‌లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి(PM Modi) ఈ వ్యాఖ్యలు చేశారు.
- By Pasha Published Date - 04:58 PM, Sun - 15 September 24

PM Modi : జార్ఖండ్‌లో బంగ్లాదేశీయులు, రొహింగ్యాల చొరబాట్లు పెరిగిపోయాయని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆందోళన వ్యక్తం చేశారు. అయినా ఈ విషయాన్ని ఒప్పుకోవడానికి రాష్ట్రాన్ని పాలిస్తున్న జార్ఖండ్ ముక్తి మోర్చా ( జేఎంఎం), కాంగ్రెస్ కూటమి సిద్ధంగా లేదన్నారు. ఆ చొరబాటుదారులతో జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. బంగ్లాదేశీయులు, రొహింగ్యాల చొరబాట్లు ఇలాగే కొనసాగితే జార్ఖండ్ జనాభా సంఖ్యలో పెనుమార్పు వస్తుందని మోడీ తెలిపారు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న రాష్ట్ర ప్రజలు అభద్రతాభావంలో ఉన్నారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. జార్ఖండ్ రాష్ట్రానికి అతిపెద్ద శత్రువులుగా జేఎంఎం, కాంగ్రెస్ తయారయ్యాయని ఆయన విమర్శించారు. జంషెడ్ పూర్‌లోని గోపాల్ మైదాన్‌లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి(PM Modi) ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read :Space Walk : ‘స్పేస్ వాక్’ చేసి.. భూమికి తిరిగొచ్చిన ‘ఆ నలుగురు’
‘‘జార్ఖండ్‌ను కాంగ్రెస్ చాలా కాలంగా ద్వేషిస్తోంది. ప్రత్యేక రాష్ట్రంగా జార్ఖండ్ ఏర్పడినందుకు ఆర్జేడీ ఇప్పటికీ ప్రతీకారం కోరుకుంటోంది. అధికార పార్టీ ఆదివాసీ వర్గాలకు ద్రోహం చేస్తోంది. ఆదివాసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జేఎంఎం ఇప్పుడు అదివాసీల భూములను కబ్జా చేస్తోంది’’ అని ప్రధాని మోడీ ఆరోపించారు. కాంగ్రెస్-జేఎంఎం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ను అత్యంత అవినీతిమయ పార్టీగా మోడీ అభివర్ణించారు. కాంగ్రెస్ అవినీతి పాఠశాలలోనే జేఎంఎం పార్టీ కూడా ట్రైనింగ్ తీసుకుందని విమర్శించారు. గత ఐదేళ్లలో ఆ రెండు పార్టీలు కలిసి దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఇంకేం చేయలేదన్నారు. రాష్ట్రంలోని నీరు, అడవులు, భూమి ఇలా అన్నిచోట్లా అవినీతికి పాల్పడ్డారని ప్రధాని ఆరోపించారు. వీటికి సంబంధించిన కేసులన్నింటిపై దర్యాప్తు జరిగి తీరుతుందన్నారు. జార్ఖండ్ సంపదనను దోచుకున్న వారిని వదిలే ప్రసక్తే లేదని మోడీ స్పష్టం చేశారు. కాగా, అంతకుముందు రాంచీలో రూ.660 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను వర్చువల్ గా ప్రధాని ప్రారంభించారు. ఆరు వందే భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపి వర్చువల్‌గా ప్రారంభించారు.