India Vs Pakistan : ఉగ్రవాది హఫీజ్ సయీద్ అప్పగింతపై పాక్ రియాక్షన్ ఇదీ..
India Vs Pakistan : 2008లో ముంబైపై జరిగిన 26/11 ఉగ్రదాడి సూత్రధారి, ఉగ్ర సంస్థ లష్కరే తైబా చీఫ్ హఫీజ్ సయీద్‌ను పాక్ నుంచి భారత్‌కు రప్పించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.
- Author : Pasha
Date : 30-12-2023 - 7:18 IST
Published By : Hashtagu Telugu Desk
India Vs Pakistan : 2008లో ముంబైపై జరిగిన 26/11 ఉగ్రదాడి సూత్రధారి, ఉగ్ర సంస్థ లష్కరే తైబా చీఫ్ హఫీజ్ సయీద్‌ను పాక్ నుంచి భారత్‌కు రప్పించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. 26/11 ఉగ్రదాడి సహా భారత్‌లో వివిధ చోట్ల జరిగిన ఉగ్రదాడుల్లో హఫీజ్ సయీద్ పాత్రకు సంబంధించిన అన్ని ఆధారాలను పాకిస్తాన్ విదేశాంగ శాఖకు అందించామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ వెల్లడించారు. కొన్ని మనీలాండరింగ్ కేసుల్లోనూ ఉగ్రవాది హఫీజ్ పాత్ర ఉందన్నారు. ఈ కేసుల్లో భారత న్యాయస్థానాల విచారణను ఎదుర్కొనేందుకు అతడిని తమకు అప్పగించాలని పాక్‌ను కోరామని తెలిపారు. ఇక ఈ అభ్యర్థనపై పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ స్పందించారు. హఫీజ్ సయీద్‌ను అప్పగించాలంటూ భారత్ నుంచి తమకు అభ్యర్ధన అందిందని ఆమె(India Vs Pakistan) వెల్లడించారు. అయితే భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక అప్పగింతల ఒప్పందం ఇప్పటిదాకా కుదర లేదని ఆమె చెప్పారు. ఈ కారణం వల్ల తాము భారత్ అభ్యర్థనపై ముందడుగు వేయలేకపోతున్నామని స్పష్టం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
పాక్ ఎన్నికల బరిలో హఫీజ్ సయీద్ రాజకీయ పార్టీ
- హఫీజ్ సయీద్ రాజకీయ పార్టీ పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ (PMML) 2024 ఫిబ్రవరిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయనుంది. దేశంలోని అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ ప్రకటించింది.
- హఫీజ్ సయీద్ కుమారుడి పేరు తల్హా సయీద్. అతడు 2024 ఫిబ్రవరిలో జరగనున్న పాక్ ఎన్నికల్లో లాహోర్‌లోని నేషనల్ అసెంబ్లీ నియోజకవర్గం NA-127 నుంచి పోటీ చేయనున్నాడు.
- PMML పార్టీ సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు ఖలీద్ మసూద్ సింధు NA-130 నుంచి పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) అధినేత నవాజ్ షరీఫ్‌పై పోటీ చేస్తున్నారు.
- గతంలోకి వెళితే.. ఉగ్రవాదులకు నిధులను సమకూర్చాడనే అభియోగాలతో 2022 ఏప్రిల్‌లో పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఉన్న ప్రత్యేక ఉగ్రవాద నిరోధక కోర్టు హఫీజ్ సయీద్‌కు 33 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
- వాస్తవానికి వివిధ నేర, ఉగ్రవాద అభియోగాలతో 2019 జూలై 17 నుంచే హఫీజ్ సయీద్ జైలులో ఉన్నాడు.
- 2000వ దశకం ప్రారంభంలోనే హఫీజ్ సయీద్‌ను ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్లు ఉగ్రవాదిగా గుర్తించాయి.
- ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2008 డిసెంబర్‌లో హఫీజ్ సయీద్‌ను ఉగ్రవాదిగా గుర్తించింది.