911 Call: ఇండియా అంటే మాకు ‘911 కాల్’.. మాజీ రక్షణమంత్రి కీలక వ్యాఖ్యలు
911 Call : మాల్దీవులకు చెందిన కొందరు మంత్రులు, ఎంపీలు భారత ప్రధాని నరేంద్రమోడీపై, లక్షద్వీప్‌పై చేసిన వ్యాఖ్యలను అందరూ తప్పుపడుతున్నారు.
- By Pasha Published Date - 09:43 AM, Tue - 9 January 24

911 Call : మాల్దీవులకు చెందిన కొందరు మంత్రులు, ఎంపీలు భారత ప్రధాని నరేంద్రమోడీపై, లక్షద్వీప్‌పై చేసిన వ్యాఖ్యలను అందరూ తప్పుపడుతున్నారు. సాక్షాత్తూ మాల్దీవుల మాజీ రక్షణమంత్రి మరియా అహ్మద్ దీదీ కూడా ఆ కామెంట్స్‌ను ఖండించారు. భారత ప్రధానిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం అనేది మాల్దీవుల ప్రభుత్వ సంకుచిత వైఖరికి అద్దం పడుతోందని ఆమె మండిపడ్డారు. వాస్తవానికి భారత్ తమకు నమ్మకమైన మిత్రదేశమని.. రక్షణ రంగం సహా వివిధ రంగాలలో సహాయం అందిస్తోందని మరియా అహ్మద్ దీదీ చెప్పారు. భారత్‌తో కొనసాగుతున్న దీర్ఘకాల సంబంధాన్ని దెబ్బతీసేలా మాల్దీవుల మంత్రుల కామెంట్స్ ఉన్నాయన్నారు. ‘‘మాల్దీవుల కోసం భారతదేశం 911 కాల్‌గా(911 Call) పనిచేసింది. ఎల్లప్పుడూ అవసరమైన సమయాల్లో మా దేశాన్ని రక్షించడానికి భారత ఆర్మీ వచ్చింది. అన్ని దేశాలతో స్నేహం చేయడం అత్యవసరం. భారతదేశంతో మన సరిహద్దులు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోకూడదు. ఉమ్మడి భద్రతా సమస్యలను ఇరుదేశాలు ఉమ్మడిగా ఎదుర్కొంటూ ఉంటాయి. ఈక్రమంలో భారతదేశం ఎల్లప్పుడూ మాకు సహాయం చేస్తోంది. రక్షణ రంగంలో మాల్దీవులను స్వయం సమృద్ధిగా మార్చడానికి భారత్ చేసిన ప్రయత్నం చాలా గొప్పది’’ అని మరియా అహ్మద్ దీదీ వివరించారు. ‘‘చారిత్రాత్మకమైన “ఇండియా ఫస్ట్” విధానాన్ని మాల్దీవులు కొనసాగిస్తే మంచిది. అవసరమైన సమయాల్లో నిలకడగా మద్దతునిచ్చే సమీప పొరుగు దేశంగా భారతదేశాన్ని గుర్తించాలి. వైద్య చికిత్సల కోసం కూడా నిత్యం ఎంతోమంది మా దేశం నుంచి ఇండియాకు వెళ్తుంటారు’’ అని మరియా అహ్మద్ దీదీ తెలిపారు.
#WATCH | Male: On the row over Maldives MP's post on Prime Minister Narendra Modi, Former Maldives Defence Minister Mariya Ahmed Didi says, "… India has been our 911 call, whenever we need it, we give a call and you all come to our rescue. That kind of a friend. When you see… pic.twitter.com/9X64vqwWwg
— ANI (@ANI) January 8, 2024
We’re now on WhatsApp. Click to Join.
భారత్ – మాల్దీవుల సంబంధాలపై చైనా కామెంట్ ఇదీ..
భారత వ్యతిరేక వైఖరి కలిగిన మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ.. ‘ఇండియా అవుట్’ నినాదంతో అధికారంలోకి వచ్చారు. చైనా అనుకూల వ్యక్తిగా పేరు ఉన్న మహ్మద్ మొయిజ్జూ.. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి విదేశీ పర్యటన కోసం చైనాకు వెళ్లిన మహ్మద్ మొయిజ్జూ.. అదే సమయంలో భారత్ మాల్దీవుల మధ్య దౌత్య వివాదం చెలరేగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే మహ్మద్ మొయిజ్జూ చైనాలో దిగిన రోజే అక్కడి ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ తన ఎడిటోరియల్‌లో భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Also Read: Human Remains To Moon : చంద్రుడిపైకి చితాభస్మం, అస్థికలు, డీఎన్ఏ శాంపిల్స్.. ఎవరివో తెలుసా ?
దక్షిణాసియాలో నెలకొన్న సమస్యలను చూడటానికి భారత్‌కు ‘‘ఓపెన్ మైండెడ్’’ విధానం అవసరమని చైనా తన అక్కసును వెళ్లగక్కింది. తాము మాల్దీవులను ఎల్లప్పుడూ సమాన భాగస్వామిగా చూస్తామని.. మాల్దీవులు సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తామని పేర్కొంది. ఈ క్రమంలోనే మాల్దీవులు, భారత్ మధ్య స్నేహపూర్వక, సహకార సంబంధాలను కూడా గౌరవిస్తామని తెలిపింది. భారత్‌లో మాల్దీవులతో సంబంధాల ప్రాముఖ్యత గురించి తమకు తెలుసని పేర్కొంది. చైనా, భారత్ మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా వాటి కారణంగా తాము ఎన్నడూ కూడా భారత్‌ను దూరం పెట్టాలని మాల్దీవులను కోరలేదని స్పష్టం చేసింది. చైనా-భారత్-మాల్దీవుల మధ్య త్రైపాక్షిక సహకారాన్ని పెంపొందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చైనా వెల్లడించింది. దక్షిణాసియా దేశాలతో చైనా సహకారం “జీరో-సమ్ గేమ్” అని తెలిపింది. అందువల్ల భారత్ మరింత ఓపెన్ మైండెడ్‌గా ఉండాలని సూచించింది.