One Nation One Election : 2024లో జమిలి ఎన్నికల నిర్వహణ కష్టమే : లా కమిషన్
One Nation One Election : వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కీలక విషయం బయటికి వచ్చింది.
- By Pasha Published Date - 04:06 PM, Fri - 29 September 23

One Nation One Election : వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కీలక విషయం బయటికి వచ్చింది. 2024లో జమిలి ఎన్నికలు లేనట్టే అని సంకేతాలు వెలువడ్డాయి. వచ్చే ఏడాది జమిలి ఎన్నికల నిర్వహణ అసాధ్యమని, 2029 నాటికి ఆ దిశగా ఏర్పాట్లు చేసుకోవచ్చని కేంద్ర సర్కారుకు లా కమిషన్ సిఫార్సు చేసిందంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో వచ్చే సంవత్సరంలో దేశంలో గ్రామ పంచాయతీ నుంచి లోక్ సభ దాకా జమిలి ఎన్నికలు జరగబోవని తేలిపోయింది. రెండు రోజుల క్రితమే ఢిల్లీలో భేటీ అయిన లా కమిషన్.. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ఈ మేరకు అభిప్రాయానికి వచ్చిందని సమాచారం. ఇదే విషయాన్ని కేంద్ర న్యాయశాఖకు తెలియజేసిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశంపై లా కమిషన్ రిపోర్టు తయారీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, మరింత స్టడీ చేసిన తర్వాతే రిపోర్టు రూపకల్పన ఒక కొలిక్కి వస్తుందని తెలిపాయి.
లాకమిషన్ చైర్మన్ ఏమన్నారంటే..
‘‘ఒకే దేశం, ఒకే ఎన్నిక అంశంపై ఇంకా లోతైన అధ్యయనం చేయాల్సి ఉంది. దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. అందుకే నివేదికను ఫైనలైజ్ చేయలేదు. దీంతో పాటు పోక్సో యాక్ట్, ఆన్‌లైన్ FIRలకు సంబంధించిన రిపోర్ట్‌లు కూడా ఫైనలైజ్ కావాల్సి ఉంది’’ అని లాకమిషన్ చైర్మన్ జస్టిస్ రీతూరాజ్ ఆవస్తి పేర్కొనడం గమనార్హం.
Also read : kalyani priyadarshan : గోల్డెన్ వైబ్స్ లో ఆదరగౌడుతున్న కళ్యాణి ప్రియదర్శన్
మరోవైపు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని 14 మంది సభ్యుల ఉన్నత స్థాయి కమిటీ కూడా జమిలి ఎన్నికలపై కసరత్తు చేస్తోంది. లా కమిషన్ సిఫారసులను కూడా ఈ కమిటీ పరిగణనలోకి తీసుకోనుంది. చివరగా రామ్ నాథ్ కోవింద్ కమిటీ (One Nation One Election) ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్ర సర్కారు నిర్ణయాన్ని తీసుకోనుంది. ఈ కమిటీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, మాజీ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ జనరల్ సెక్రటరీ సుభాష్ కశ్యప్, సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి, న్యాయశాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఉన్నారు.