NEET UG Counselling: లీకైన వీడియోలు నకిలీవి.. వచ్చే వారం నుంచే ‘నీట్-యూజీ’ కౌన్సెలింగ్ : కేంద్రం
నీట్ -యూజీ 2024 పరీక్షకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
- By Pasha Published Date - 10:17 AM, Thu - 11 July 24

NEET UG Counselling: నీట్ -యూజీ 2024 పరీక్షకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. జులై మూడో వారం నుంచి నాలుగు రౌండ్లలో కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహిస్తామని తెలిపింది. ఎవరైనా అభ్యర్థి అవకతవకలకు పాల్పడినట్లు తేలితే.. కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో లేదా ఆ తర్వాత కూడా చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యే విద్యార్థులపై కౌన్సెలింగ్(NEET UG Counselling) ఏ దశలోనైనా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది. ‘నిరాధారమైన ఆందోళనల’ ప్రాతిపదికన 23 లక్షల మంది అభ్యర్థులను కలవరపెట్టేలా నీట్-యూజీ ప్రవేశ పరీక్షను రద్దు చేయలేమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దోషులుగా తేలే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.
We’re now on WhatsApp. Click to Join
గుజరాత్‌లోని గోద్రా, బిహార్‌లోని పాట్నాలో ఉన్న కొన్ని కేంద్రాల్లో కొందరు వ్యక్తులు అక్రమాలకు పాల్పడ్డారని సుప్రీంకోర్టుకు కేంద్ర సర్కారు(Centre Govt) తెలిపింది. అయితే ఆ అక్రమాల కారణంగా ఆయా పరీక్షా కేంద్రాలలో నీట్-యూజీ ఎగ్జామ్ రాసిన విద్యార్థుల పనితీరు, మార్కులు సాధించిన తీరుపై పెద్దగా ప్రభావం పడలేదని పేర్కొంది. దేశంలోని వివిధ పరీక్ష కేంద్రాల్లో నీట్ రాసిన వారితో పోల్చుకుంటే.. ఈ వివాదాస్పద కేంద్రాలలో ఎగ్జామ్ రాసిన వారి పనితీరు భిన్నంగా లేదని వెల్లడైందని స్పష్టం చేసింది.
Also Read :Phone Tapping Case : ‘ఫోన్ ట్యాపింగ్’తో నాకు సంబంధం లేదు.. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు లేఖ
ఐఐటీ మద్రాస్ నిపుణులు నీట్-యూజీ పరీక్ష ఫలితాల సమాచారాన్ని సాంకేతికంగా విశ్లేషించి .. మునుపటితో పోలిస్తే ఈసారి వాటిలో పెద్దగా హెచ్చుతగ్గులు జరగలేదని తేల్చిందని కోర్టుకు కేంద్రం తెలిపింది. లీక్ అయిన నీట్-యూజీ పరీక్ష ప్రశ్నాపత్రాల టెలిగ్రామ్ వీడియోలు నకిలీవని ఈ పరీక్షను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మరో అఫిడవిట్‌లో సుప్రీంకోర్టుకు తెలియజేసింది. భవిష్యత్తులో ప్రశ్నాపత్రాల లీక్‌లు జరగకుండా చర్యలు తీసుకునే అంశంపై అధ్యయనానికి ఏడుగురు నిపుణుల ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపింది.