Ayodhya Ram Mandir : భరించకు.. భయపడకు!
- By Sudheer Published Date - 12:01 PM, Sat - 13 January 24

డా. ప్రసాదమూర్తి
రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నీలమేఘ శ్యాముడు శ్రీరాముడు ఆకాశమంత ధనుస్సును చేతబూని అందులో ఒక బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఆ బాణం చివర త్రికోణాకారంలో ఉన్న చోట మోడీ బొమ్మ ఉంది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. చుట్టూ చూస్తే ఏమీ లేదు. అంతా నా భ్రమ అనుకుని మళ్ళీ కళ్ళు మూసుకుని నిద్రపోయాను. ఈసారి మరో కల వచ్చింది. అందులో నరేంద్ర మోడీ ఆకాశమంత ధనుస్సును ధరించి ఒక బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఆ బాణం చివర త్రికోణాకారంలో ఉన్న స్థలంలో శ్రీరాముడి బొమ్మ ఉంది. ఉలిక్కిపడి మళ్ళీ లేచాను. ఏమీ లేదు. ఏమిటి ఇలా.. ఎందుకు ఇంత భ్రమ కలుగుతుంది? వివరించాల్సిన పనిలేదు. ఈపాటికి అందరికీ అర్థమై ఉంటుంది. ప్రస్తుతం అయోధ్య వైపు, అయోధ్యలో ఉన్న రామ మందిరం వైపు, రామ మందిరంలో ప్రాణప్రతిష్ట చేయబడుతున్న రాముని ప్రతిమ వైపు, రాముని ప్రతిమ చెంతనే నిలబడి ప్రాణ ప్రతిష్ట చేసే ప్రధాని మోడీ వైపు దేశమంతా ఇప్పుడు దృష్టి సారించి ఉంది. ఇదీ సంగతి. ఇక ఎవరు ఏమి చెప్పినా రామనామం జపించకపోతే, మోడీ ఆహ్వానం మన్నించి అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కాకపోతే వారంతా రామ విరోధులు, హిందూ విరోధులుగా ముద్ర మోస్తారు. పాపం విపక్షాలకు ఎంతటి విపత్కర పరిస్థితి వచ్చింది? వారి అయోమయ స్థితి, సంకట స్థితి తలుచుకుంటేనే ఎంతో జాలి కలుగుతుంది కదా. ఈ స్థితి నుంచి బయటపడడానికి, నరేంద్ర మోడీ ఈ అతి నవీన రాజకీయాన్ని ఎదుర్కోవడానికి రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా న్యాయ యాత్ర ప్రారంభించబోతున్నారు. రామ మందిర ప్రారంభానికి వారం రోజులు ముందే ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. ఎలా రాహుల్ గాంధీ, మోడీ వదిలే రామబాణం నుంచి తప్పించుకొని ఆ బాణాన్ని మోడీ వైపే తిప్పి కొట్టగల నేర్పును ప్రదర్శిస్తారో, ఆయన ఎలా అడుగులు వేస్తూ ముందుకు సాగుతారో చూడాలి.
We’re now on WhatsApp. Click to Join.
రాహుల్ న్యాయ వ్యూహం:
రాహుల్ చేపట్టబోతున్న భారత న్యాయ యాత్ర కోసం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికలలో ఒక థీమ్ సాంగ్ రిలీజ్ చేసింది. దానికి ట్యాగ్ లైన్ గా “సహోమత్..డరో మత్” అని పేరు పెట్టారు. అంటే సహించవద్దు.. భయపడవద్దు అని అర్థం. రాహుల్ గాంధీ స్థిరమైన ఒక విజ్ఞతతో కూడిన అడుగులు వేస్తున్నట్టుగా ఆయన మాటలలో మనకు కనిపిస్తుంది. స్వామి వివేకానంద జన్మదినోత్సవ సందర్భంగా శుక్రవారం రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మాటలు ఆయన విజ్ఞతను ప్రదర్శిస్తున్నాయి. భావోద్వేగాల మాయాజాలంలో పడవద్దని, న్యాయపోరాటంలో చేతులు కలపమని రాహుల్ యువతకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ పేర్కొన్న మాటలను యువత ఎంత అర్థం చేసుకుంటుందో కానీ అలా అర్థం చేసుకుంటే మంచిదని మాత్రం మనం చెప్పగలం. మన దేశ స్వప్నాలకు అనుగుణమైన ఉనికిని సాధించాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. నాణ్యమైన జీవితం కావాలా.. ఉద్వేగాలు కావాలా తేల్చుకోమన్నారు. ఉద్రేకమా.. ఉద్యోగమా? ప్రేమా..ద్వేషమా? ఏం కావాలో పోల్చుకోమని ఆయన యువతకు సందేశం ఇచ్చారు. నిత్య జీవిత సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికి భావోద్వేగ పూరిత అంశాలను ముందుకు తీసుకొస్తున్నారని, వాటిని రాజకీయాలతో ముడిపెడుతున్నారని, వీటి పట్ల యువత జాగరూకతతో ఉండాలని ఆయన హెచ్చరించారు. ఇవి నిజంగా రాహుల్ గాంధీ లోనే రాజకీయ పరిణతిని, ఆయనలోని రాజకీయ స్థిరత్వాన్ని తెలియచేసే మాటలే. యువకులు, పేదలు, రైతులు, ఉద్యోగాల కోసం చదువు కోసం జీవన భృతి కోసం, శ్రమ ఫలితం కోసం సతమవుతమైపోతుంటే, అమృత కాల్ అంటూ ప్రభుత్వం చేస్తున్న నినాదాలను ఆయన విమర్శించారు. ప్రభుత్వం ప్రజల సమస్యల నుంచి ఎప్పుడో దారి తప్పిందని, పాలకులు అధికారం మత్తులో మునిగిపోయారని, దేశ వాస్తవిక పరిస్థితులకు నుండి వారు దూరమైపోయారని రాహుల్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. అందుకే న్యాయ దీపాన్ని పట్టుకొని యువకులు ముందుకు నడవాలని, కోట్లాది యువకులు న్యాయ యోధులుగా మారి ఈ పోరాటాన్ని ముందుకు నడిపించాలని, అందుకు స్వామి వివేకానంద లాంటి మహా వ్యక్తి నుంచి ప్రేరణ పొందాలని రాహుల్ యువకులకు సందేశం ఇచ్చారు. వాస్తవానికి దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగం, ఆహార కొరత, దారిద్యం, హక్కుల అణచివేత మొదలైన సమస్యలే అతి కీలకమైనవి. ఈ సమస్యల నుంచి ప్రజలను దూరం జరిపే ప్రయత్నాలలో పాలకులు మరో దారిని ఎంచుకున్నప్పుడు న్యాయపోరాటమే శరణ్యం. ఆ పోరాట మార్గాన్ని రాహుల్ ఎంచుకున్నారు. తాను ఎంచుకున్న మార్గాన తాను మాత్రమే నడిస్తే కాదు. దేశాన్ని కూడా ఆ మార్గంలో నడిపించడంలో రాహుల్ ఎంత కృతకృత్యులు అవుతారో అంత మేరకు ఆయన మోడీని ఢీకొనగలరు. చూడాలి, మోడీ రామ యజ్ఞం ఫలిస్తుందా.. రాహుల్ న్యాయ యజ్ఞం జయిస్తుందా!.
Read Also : Trivikram : గురూజీ పెన్నుకి పదును తగ్గిందెందుకు..?