Mahakumbh Day 1 : కొన్ని గంటల్లోనే 60 లక్షల మంది పుణ్యస్నానాలు.. మహా కుంభమేళాలో తొలిరోజు
- By Pasha Published Date - 12:08 PM, Mon - 13 January 25

Mahakumbh Day 1 : మహా కుంభమేళాలో తొలి రోజు సందర్భంగా ఇవాళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్ జన సంద్రమైంది. ఈ ఆధ్యాత్మిక వేడుక వేళ ఈ ఒక్కరోజు ఇప్పటివరకు దాదాపు 60 లక్షల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు. ఇవాళ ఉదయం 7.30 గంటల వరకు 35 లక్షల మంది, ఉదయం 9.30 గంటల వరకు మరో 25 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి. అంటే ఇవాళ ఉదయం 5 గంటల నుంచి 9.30 గంటల మధ్య 60 లక్షల మంది పుణ్య స్నానాలను ఆచరించే గొప్ప అవకాశాన్ని దక్కించుకున్నారు. ప్రతి గంటకు సగటున 2 లక్షల మంది భక్తులు సంగమంలో పుణ్య స్నానాలు చేస్తున్నారు. ఈ రోజు నుంచి 45 రోజుల పాటు మహాకుంభ మేళా జరగనుంది. ఈ మేళాకు జర్మనీ, బ్రెజిల్, రష్యా సహా 20 దేశాల నుంచి భక్తులు తరలి వచ్చారు.
- యాపిల్ సహ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ మహాకుంభ మేళాకు చేరుకున్నారు. ఆమె నిరంజని అఖారాలో స్టీవ్ జాబ్స్ కోసం కర్మలు చేయించారు.
- మహాకుంభ మేళాకు సంబంధించి గూగుల్ ప్రత్యేక ఫీచర్‌ను ప్రారంభించింది. ‘‘నేను మహాకుంభ్’’ అని గూగుల్ పేజీలో టైప్ చేయగానే వర్చువల్‌గా పువ్వుల వర్షం కురుస్తోంది.
Also Read :Celebrities In Bhogi : భోగి వేడుకల్లో మోహన్ బాబు, మంచు విష్ణు, సాయికుమార్.. ఎన్టీఆర్, సాయి ధరంతేజ్ విషెస్
మహాకుంభ మేళా ముగిసే వరకు ప్రయాగ్ రాజ్‌కు దాదాపు 35 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. నదిలో పహారా కాసేందుకు ప్రత్యేకంగా తేలియాడే పోలీసుస్టేషన్‌ను ఏర్పాటుచేశారు. చిన్నచిన్న పడవలపై భద్రతా సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్నారు. మొత్తం మీద భారీ భద్రత నడుమ ఈసారి మహాకుంభ మేళా జరుగుతోంది. 10వేల ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు జరిగాయి. ఏ సమయంలోనైనా 50 లక్షల మంది నుంచి కోటి మంది ఉండగలిగేలా సౌకర్యాలను కల్పించారు. యాత్రికుల భద్రత కోసం 55 పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేశారు. 45 వేల మంది పోలీసులను మోహరించారు. సాధువులకు సంబంధించిన 13 అఖాడాలు కుంభమేళాలో భాగం అయ్యాయి.