6 WhatsApp Groups : ‘లోక్‌సభ’ ఘటన దుండగులు ఎలా స్కెచ్ వేశారంటే ?
6 WhatsApp Groups : డిసెంబరు 13న లోక్‌సభలో హల్‌చల్ చేసిన దుండగుల వ్యవహారంతో ముడిపడిన విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
- By Pasha Published Date - 10:31 AM, Wed - 20 December 23

6 WhatsApp Groups : డిసెంబరు 13న లోక్‌సభలో హల్‌చల్ చేసిన దుండగుల వ్యవహారంతో ముడిపడిన విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులంతా దాదాపు 6 వాట్సాప్ గ్రూపుల ద్వారా టచ్‌లో ఉండేవారని దర్యాప్తులో తెలిసింది. ఒక్కో వాట్సాప్ గ్రూపులో దాదాపు 7 నుంచి 8 మంది ఉన్నారని అంటున్నారు. చంద్రశేఖర్ ఆజాద్, భగత్‌సింగ్ వంటి స్వాతంత్య్ర యోధుల పేర్లతో ఆ వాట్సాప్ గ్రూపులు ఉండేవని వెల్లడైంది. ఈ గ్రూపులలో వారు నిత్యం స్వాతంత్య్ర సమరయోధుల ఆలోచనలు, ఆదర్శాలపై డిస్కస్ చేసేవారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆలోచనలు, ఆదర్శాలకు సంబంధించిన వీడియో క్లిప్పులను కూడా పరస్పరం షేర్(6 WhatsApp Groups) చేసుకునేవారు.
We’re now on WhatsApp. Click to Join.
బ్రిటీష్ పాలకుల నిరంకుశ చట్టాలను నిరసిస్తూ పార్లమెంట్లో పొగ బాంబు వేసిన భగత్ సింగ్ చర్యను రిపీట్ చేయాలని ఈ ఆరుగురు నిందితులు నిర్ణయించుకున్నారని పోలీసులు చెప్పారు. పార్లమెంటులో సెక్యూరిటీని దాటుకొని లోపలికి ఎలా వెళ్లాలి ? లోపల ఏం చేయాలి ? అనే దానిపైనా ఆరుగురు నిందితులు గత ఏడాది సిగ్నల్స్ యాప్‌లో డిస్కస్ చేసుకున్నారని వెల్లడించారు. ఈ డిస్కషన్ పూర్తయ్యాక.. మైసూరులో భేటీ అయ్యారని, వారి ప్రయాణాలకు అయిన ఖర్చులను మైసూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి మనోరంజన్ భరించాడని తెలిపారు. ఆరుగురు నిందితులు, వారి కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల వివరాలను కూడా ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ సేకరించింది.