Army – Kautilyas Lessons : ఆర్మీకి కౌటిల్యుడి యుద్ధ వ్యూహాలపై పాఠాలు!
Army - Kautilyas Lessons : యుద్ధ వ్యూహాల కోసం కౌటిల్యుడు, కమందక, కురల్ వంటి మేధావులు అలనాడు రూపొందించిన సిద్దాంతాలను వినియోగించాలనే ప్రతిపాదనలను భారత రక్షణ శాఖ పరిశీలిస్తోంది.
- By Pasha Published Date - 05:36 PM, Wed - 4 October 23

Army – Kautilyas Lessons : యుద్ధ వ్యూహాల కోసం కౌటిల్యుడు, కమందక, కురల్ వంటి మేధావులు అలనాడు రూపొందించిన సిద్దాంతాలను వినియోగించాలనే ప్రతిపాదనలను భారత రక్షణ శాఖ పరిశీలిస్తోంది. భారత సంస్కృతితో ముడి పడి, మన దేశానికే సొంతమైన అరుదైన యుద్ధ రీతులను, దౌత్య విధానాన్ని ఆచరణలోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి భారత సర్కారు ‘ప్రాజెక్ట్ ఉద్భవ్’ను మొదలుపెట్టింది. ‘ప్రాజెక్ట్ ఉద్భవ్’ కు సంబంధించిన కమిటీలోని రక్షణ రంగ నిపుణులు .. రక్షణ రంగానికి చెందిన యునైటెడ్ సర్వీస్ ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా (యూఎస్ఐ) సహకారంతో ప్రాచీన భారత యుద్ధ తంత్రాలపై రీసెర్చ్ చేస్తోంది. ఇప్పటికే ‘ప్రాజెక్ట్ ఉద్భవ్’ కమిటీ సెప్టెంబర్ 29న భేటీ అయింది. మన దేశ యుద్ధ వ్యూహాలను ఎలా సంస్కరించాలో ఆ సమావేశంలో చర్చించారు.
We’re now on WhatsApp. Click to Join
ప్రాచీన భారత్ లోని వివిధ రాజ్యాల్లోని యుద్ధ కళలను ఇప్పటి కాలానికి తగ్గట్టుగా ఎలా వాడాలనే దానిపై స్టడీ చేయాలని ఈ మీటింగ్ లో నిర్ణయించారు. ప్రాచీన భారత రాజ్యాలు తమ సైన్యాలను ఎలా పవర్‌ఫుల్‌గా మార్చుకున్నాయి ? కాలం గడిచే కొద్దీ ఎలాంటి సంస్కరణలు చేసుకున్నాయి ? తమ నేలను ఎలా కాపాడుకున్నాయి ? అనే టాపిక్స్ పై ప్రాజెక్ట్ ఉద్భవ్ కమిటీ ఫోకస్ చేయాలని తీర్మానించారు. ఈ క్రమంలోనే ఈనెల 21,22 తేదీల్లో యూఎస్ఐ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ ను నిర్వహించనుంది. భారత సైనిక వ్యూహాలు, మిలిటరీ సామర్థ్యాలు, భద్రతా బలగాల నవీకరణ, ఆత్మనిర్భర భారత్ వంటి అంశాలపై ఈ ఫెస్టివల్‌లో చర్చించనున్నారు. వాస్తవానికి ఈ దిశగా కసరత్తు 2021లోనే మొదలైంది. చరిత్ర పుస్తకాల నుంచి 75 సిద్ధాంతాలను సేకరించి ఓ బుక్ ను కూడా పబ్లిష్ చేశారు. దీన్ని ఇంగ్లిష్ లోకి అనువాదం చేసి అందరికీ అందించారు.ఇండియన్ ఆర్మీలోని అన్ని ర్యాంకుల అధికారులు దాన్ని చదవాలని (Army – Kautilyas Lessons) ఆదేశించారు.