ISRO’s New Goal: ఇస్రో టార్గెట్: టవర్లు లేకుండా నేరుగా ఫోన్లకు ఇంటర్నెట్
ఈ టెక్నాలజీ ద్వారా ఉపగ్రహం నుంచి నేరుగా సిగ్నల్ మొబైల్ ఫోన్‌కు చేరుతుంది. టవర్లు, బేస్ స్టేషన్లు అవసరం ఉండదు.
- By Dinesh Akula Published Date - 12:25 PM, Tue - 23 September 25
హరికోట, ఆంధ్రప్రదేశ్: (ISRO’s New Goal)- ఇంటర్నెట్ అంటే ఫైబర్ లైన్లు లేదా మొబైల్ టవర్లు అనుకున్న కాలం కాస్త మారబోతుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, టవర్లు లేకుండానే నేరుగా మొబైల్ ఫోన్‌లకు ఇంటర్నెట్ అందించే టెక్నాలజీను ముందుకు తీసుకొచ్చేందుకు మరో అడుగు వేసింది. ఇది భవిష్యత్ డిజిటల్ ఇండియాకి దిశానిర్దేశకమైన ముందడుగు అవుతుంది.
ఈ టెక్నాలజీ ద్వారా ఉపగ్రహం నుంచి నేరుగా సిగ్నల్ మొబైల్ ఫోన్‌కు చేరుతుంది. టవర్లు, బేస్ స్టేషన్లు అవసరం ఉండదు. అంటే అడవులు, లోయలు, పర్వత ప్రాంతాలు, సముద్రం మధ్యలోనూ ఇంటర్నెట్ కనెక్టివిటీ సాధ్యమవుతుంది.
ఇస్రో అక్టోబర్‌లో శ్రీహరికోట నుంచి భారీ బాహుబలి రాకెట్ LVM-3 ద్వారా అమెరికా కంపెనీ AST SpaceMobile రూపొందించిన BlueBird-2 అనే కమర్షియల్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్షలోకి పంపనుంది. ఈ ప్రయోగంలో ఇస్రో లాంచ్ సేవలకే పరిమితం కానుంది.
ఉపగ్రహం టెక్నాలజీ, ఆపరేషన్, డేటా నియంత్రణ మొత్తం అమెరికా కంపెనీ ఆధీనంలోనే ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సాధారణ మొబైల్ ఫోన్‌కు నేరుగా ఉపగ్రహం ద్వారా ఇంటర్నెట్ అందించే కమర్షియల్ ప్రాజెక్ట్ ఏదీ పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. ఎలన్ మస్క్ యొక్క స్టార్‌లింక్, ఎయిర్‌టెల్-వన్‌వెబ్, అమెజాన్ వంటి సంస్థలు ఇంకా ప్రయోగ దశలో ఉన్నాయి.
ఈ గ్లోబల్ లెవెల్ ప్రాజెక్ట్‌కు భారత్ వేదిక కావడం దేశానికి గౌరవకరం.
ఈ టెక్నాలజీ ద్వారా రిమోట్ ఏరియాలకు ఇంటర్నెట్ అందించటం, విపత్తుల సమయంలో కనెక్టివిటీ కొనసాగించటం, గ్రామీణ-పట్టణాల మధ్య డిజిటల్ వ్యత్యాసాన్ని తగ్గించటం వంటి ప్రయోజనాలు ఉన్నాయి.
అయితే కొన్ని పరిమితులు కూడా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. స్పీడ్ పరంగా ఫైబర్ నెట్‌వర్క్ లాగా ఉండకపోవచ్చు. వాతావరణ పరిస్థితులు సిగ్నల్‌ను ప్రభావితం చేయవచ్చు. భద్రతా అంశాలు, చట్ట పరమైన అనుమతులు కూడా సవాళ్లే.
ఇస్రో అక్టోబర్‌లో ఉపగ్రహాన్ని ప్రయోగించనుండగా, వాణిజ్య సేవలు 2026 నాటికి అందుబాటులోకి రావచ్చని అంచనా. దేశంలోని ప్రతి ఫోన్‌కి ఈ టెక్నాలజీ చేరడానికి మరికొంత సమయం పట్టొచ్చు. అయినా టవర్లు లేకుండా ఇంటర్నెట్ కల త్వరలో నిజం కాబోతుందనే ఆశ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
ఇది భారత డిజిటల్ భవిష్యత్తుకు కీలక మలుపు కానుంది.