ISRO: రేపు సింగపూర్ ఉపగ్రహాలు ప్రయోగించనున్న ఇస్రో.. “న్యూ స్పేస్ ఇండియా” కమర్షియల్ మిషన్!
- By Hashtag U Published Date - 09:00 PM, Wed - 29 June 22

అంతరిక్ష రంగంలో ఇస్రో కొత్త పుంతలు తొక్కుతోంది. ఇతర దేశాల ఉపగ్రహాలను ప్రయోగించే వారధిగానూ మారి ప్రభుత్వానికి కాసులు పండిస్తోంది. సింగపూర్ కు చెందిన మూడు ఉపగ్రహాలను గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు.
“న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్” అనే భారత సంస్థ తో సింగపూర్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఈ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు. దీనికి “పీ ఎస్ ఎల్ వీ – సీ 53” మిషన్ అని పేరు పెట్టారు.ఈ సంస్థ ఇంతకు ముందు కూడా ఒకసారి ఈ తరహా ప్రయోగాన్ని చేసింది. ఇప్పుడు ఇది రెండో కాంట్రాక్టు. ఇస్రో ప్లాట్ ఫామ్ ను వాడుకున్నందుకు “న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్” సంస్థ ఇస్రోకు కూడా చెల్లింపులు చేస్తుంది.
అంతరిక్ష రంగంలో ప్రయివేటు కంపెనీలకూ తలుపులు తెరవాలనే మోడీ ప్రభుత్వ నిర్ణయం వల్ల ఈ తరహా మార్పులను మనం చూస్తున్నాం. భూమధ్య రేఖకు 570 కిలోమీటర్ల ఎత్తులో ఈ మూడు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యల్లో ప్రవేశపెట్టడమే లక్ష్యంగా ఈ ప్రయోగం జరుగుతుంది. భూమి ఫోటోలను రాత్రి, పగలు, అన్ని వాతావరణ పరిస్థితుల్లో తీసి పంపడమే ఈ ఉపగ్రహాల పని. భవిష్యత్ లో అంతరిక్ష ప్రయోగ వ్యవస్థలు లేని మరెన్నో దేశాలు.. ఉపగ్రహ ప్రయోగాల కోసం భారత్ తో చేతులు కలిపే అవకాశాలు ఉన్నాయి.