RSS Chief : జాతీయ భాషపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
మనదేశంలో మాట్లాడే ప్రతి భాషా జాతీయ భాషే’’ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ (RSS Chief) తెలిపారు.
- By Pasha Published Date - 12:58 PM, Sat - 12 October 24

RSS Chief : బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ మతఛాందస వాదం ఇంకా బలంగా ఉండటం ఆందోళన కలిగించే అంశమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మతఛాందస వాదులే రాజకీయ ప్రయోజనాల కోసం అక్కడి హిందూ మైనార్టీలపై దాడులు చేస్తున్నారని ఆయన చెప్పారు. అందుకే ఇప్పుడు ప్రాణాలను రక్షించుకునేందుకు బంగ్లాదేశీ హిందువులు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బంగ్లాదేశ్‌తో పాటు యావత్ ప్రపంచంలో హిందువులంతా ఐక్యంగా ఉంటే ఇలాంటి దాడుల బారినపడకుండా తమను తాము కాపాడుకోగలుగుతారని మోహన్ భగవత్ చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ 100వ వార్షికోత్సవం సందర్భంగా ఈ దసరా పండుగను పురస్కరించుకొని మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగించారు.
Also Read :Death Penalty : అమెరికా పౌరులను చంపే వలసదారులకు మరణశిక్షే : ట్రంప్
‘‘రాజకీయ కుట్రలు కుతంత్రాలు, వామపక్ష భావజాలం, కల్చరల్ మార్క్సిస్టులు ప్రపంచంలోని అన్ని సమాజాల కల్చరల్ సంప్రదాయాలకు స్పష్టమైన శత్రువులు’’ అని మోహన్ భగవత్ చెప్పారు. బహుళ రాజకీయ పార్టీలు ఉండే భారత్ లాంటి ప్రజాస్వామిక వ్యవస్థలలో కొందరికి స్వార్థ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమైనవిగా మారాయన్నారు. దేశ ఐక్యత, జాతీయ ప్రయోజనాలకు ఆయా రాజకీయ పక్షాలు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ తెలిపారు. ప్రత్యామ్నాయ రాజకీయాల పేరిట దేశంలో చీలికలు క్రియేట్ చేసేందుకు కొన్ని దుష్ట శక్తులు కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ‘‘మనదేశంలో మాట్లాడే ప్రతి భాషా జాతీయ భాషే’’ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ (RSS Chief) తెలిపారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎంతోమంది అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోతుండటం బాధ కలిగిస్తోందన్నారు.
Also Read :Bangladesh: బంగ్లాదేశ్‌లో ప్రధాని మోదీ ఇచ్చిన బంగారు కిరీటం చోరీ
ఆర్‌ఎస్‌ఎస్ లీడర్ సురేశ్ భయ్యాజీ మాట్లాడుతూ.. ‘‘మనదేశంలోని రాష్ట్రాల్లో విభిన్న సంస్కృతులు, భాషలు ఉన్నాయి. అయితే కొందరు ఒక భాషే గొప్పదనే భ్రమను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయులు మాట్లాడే ప్రతి భాషా జాతీయ భాషే’’ అని చెప్పారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్.రాధాకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.