Death Penalty : నేరం రుజువైతే కోల్‌కతా కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌కు మరణశిక్ష: సీబీఐ కోర్టు
జూనియర్ వైద్యురాలి కేసులో నిందితులుగా ఉన్న సందీప్ ఘోష్, అభిజిత్ మోండల్ తీవ్ర అభియోగాలను(Death Penalty) ఎదుర్కొంటున్నారు.
- Author : Pasha
Date : 28-09-2024 - 1:19 IST
Published By : Hashtagu Telugu Desk
Death Penalty : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న తెల్లవారుజామున జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ కేసును విచారిస్తున్న కోల్‌కతాలోని సీబీఐ స్పెషల్ కోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. తనకు బెయిల్ ఇవ్వాలంటూ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ‘‘ఆనాడు కాలేజీ ప్రిన్సిపల్‌గా ఉన్న సందీప్ ఘోష్.. హత్యాచారం కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం చేశారు. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు యత్నించారు. ఈక్రమంలో స్థానిక తాలా పోలీసు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ అభిజిత్ మోండల్ సహాయాన్ని పొందారు. ఈ అభియోగాలన్నీ నిరూపితమైతే సందీప్ ఘోష్‌కు ఉరిశిక్ష పడే అవకాశం ఉంది’’ అని సీబీఐ కోర్టు వ్యాఖ్యానించింది. ‘‘జూనియర్ వైద్యురాలి కేసులో నిందితులుగా ఉన్న సందీప్ ఘోష్, అభిజిత్ మోండల్ తీవ్ర అభియోగాలను(Death Penalty) ఎదుర్కొంటున్నారు. అందుకే వారికి బెయిల్ ఇవ్వడం అన్యాయమని కోర్టు విశ్వసిస్తోంది’’ అని సీబీఐ న్యాయస్థానం తెలిపింది. సందీప్ ఘోష్, అభిజిత్ మోండల్‌లకు సెప్టెంబరు 30 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది.
Also Read :Jama Masjid : జామా మసీదు వ్యవహారం.. మన్మోహన్ సింగ్ సంతకం చేసిన ఫైల్ ఏమైంది ?: హైకోర్టు
ఇక ఇదే కేసులో పశ్చిమ బెంగాల్ వామపక్ష నాయకురాలు మీనాక్షి ముఖర్జీకి సీబీఐ సమన్లు జారీ చేసింది. తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. జూనియర్ వైద్యురాలు హత్యాచారానికి గురైన రోజున మీనాక్షి ముఖర్జీ బాధితురాలి తల్లిదండ్రులను కలిశారు. మీనాక్షి ముఖర్జీ ప్రయత్నాల వల్లే జూనియర్ వైద్యురాలి అంత్యక్రియల్లో జాప్యం జరిగిందని ఆమె రాజకీయ పార్టీ డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పలుమార్లు పేర్కొంది. ఈ వ్యవహారంపై ముఖర్జీని సీబీఐ ప్రశ్నించే అవకాశం ఉంది.