IB Jobs : డిప్లొమా, డిగ్రీ అర్హతతో IBలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల
IB Jobs : దేశ భద్రతలో కీలకపాత్ర పోషించే ఈ సంస్థలో జూనియర్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II, టెక్నికల్ (JIO-II/Tech) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
- By Kavya Krishna Published Date - 04:10 PM, Thu - 28 August 25

IB Jobs : భారత హోం మంత్రిత్వశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది. దేశ భద్రతలో కీలకపాత్ర పోషించే ఈ సంస్థలో జూనియర్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II, టెక్నికల్ (JIO-II/Tech) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 394 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం 394 పోస్టులలో, కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి:
- యూఆర్ (UR): 157
- ఈడబ్ల్యూఎస్ (EWS): 32
- ఓబీసీ (OBC): 117
- ఎస్సీ (SC): 60
- ఎస్టీ (ST): 28
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు కింది అర్హతలు కలిగి ఉండాలి:
ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్ వంటి స్పెషలైజేషన్లలో ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
లేదా ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్‌లో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అభ్యర్థుల వయస్సు 18 నుండి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ మరియు ఎంపిక విధానం
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు కింద యూఆర్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులు రూ.650, ఎస్సీ, ఎస్టీ, మహిళలు మరియు ఈఎస్‌ఎం కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.550 చొప్పున చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ మూడు దశలలో ఉంటుంది:
- టైర్-I: ఆన్‌లైన్ పరీక్ష
- టైర్-II: స్కిల్ టెస్ట్
- టైర్-III: ఇంటర్వ్యూ
టైర్-I పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల చొప్పున నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు జీతంతో పాటు ఇతర ప్రభుత్వ అలవెన్సులు కూడా అందుతాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎంహెచ్‌ఏ వెబ్‌సైట్ లేదా ఎన్‌సీఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవడం మంచిది.