Navjot Siddu: ఖైదీ నంబర్ 241383
కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ లోని పాటియాలా జైలు బరాక్ నంబర్ 7 (గది)లో ఖైదీగా మొదటి రోజు గడిపారు.
- Author : CS Rao
Date : 21-05-2022 - 4:41 IST
Published By : Hashtagu Telugu Desk
కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ లోని పాటియాలా జైలు బరాక్ నంబర్ 7 (గది)లో ఖైదీగా మొదటి రోజు గడిపారు. ఆయనకు కేటాయించిన నంబర్ 241383. పాటియాలా కోర్టులో లొంగిపోయిన ఆయన్ను వైద్య పరీక్షల అనంతరం జైలుకు తరలించడం తెలిసిందే. సిద్ధూ ప్రత్యర్థి, డ్రగ్స్ కేసులో నిందితుడైన శిరోమణి అకాలీదళ్ నేత బిక్రమ్ సింగ్ మజీతియా సైతం పాటియాలా జైలులోనే ఉండడం గమనార్హం.
పాటియాలా జైలులో ఉదయం 5.30 గంటలకు ఖైదీలు నిద్ర లేవాలి. అక్కడి నుంచి ఖైదీల దినచర్య మొదలవుతుంది. ఉదయం 7 గంటలకు బిస్కెట్లు, ఉడకబెట్టిన శనగలతోపాటు టీ ఇస్తారు. 8.30 గంటలకు ఆరు చపాతీలు, కలుపుకుని తినేందుకు కూర ఇస్తారు. ఆ తర్వాత వారికి కేటాయించిన పనిని సాయంత్రం 5.30 గంటలకు పూర్తి చేయాల్సి ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు డిన్నర్ కింద ఆరు చపాతీలు కూర ఇస్తారు. తిరిగి 7 గంటలకు ఖైదీలను వారి గదుల్లో బంధిస్తారు. రోజువారీ రూ.30-90 వరకు చేసిన పని ద్వారా ఒక్కో ఖైదీ సంపాదిస్తారు.
1988లో పాటియాలాకు చెందిన గుర్నామ్ సింగ్ పై సిద్ధూ, ఆయన స్నేహితుడు రూపిందర్ సింగ్ సంధు దాడికి దిగడం , అనంతరం గుర్నామ్ సింగ్ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించడం తెలిసిందే. ఈ కేసులోనే సిద్ధూకు ఏడాది జైలు శిక్ష పడింది. మొదటి రోజు రాత్రి (శుక్రవారం) సిద్ధూ జైలులో ఇచ్చిన ఆహారాన్ని తీసుకోకుండా ఫాస్టింగ్ ఉన్నారు. ఖైదీలు అందరికీ ఒకటే ఆహారం ఇస్తారు. ఒకవేళ వైద్యులు సూచిస్తే జైలు క్యాంటిన్ నుంచి ఆహారాన్ని కొనుగోలు చేసుకోవడం లేదంటే స్వయంగా వండుకోవడానికి అనుమతిస్తారు.