Hit and Run Case : ట్రక్కు డ్రైవర్ల సమ్మె.. హిట్ అండ్ రన్ కేసుల్లో శిక్షలపై కేంద్రం ప్రకటన
Hit and Run Case : ట్రక్కు డ్రైవర్లు, ట్యాంకర్ల డ్రైవర్ల నిరసనలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
- By Pasha Published Date - 08:36 AM, Wed - 3 January 24

Hit and Run Case : ట్రక్కు డ్రైవర్లు, ట్యాంకర్ల డ్రైవర్ల నిరసనలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) స్థానంలో ఇటీవల అమల్లోకి తెచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టంలోని హిట్ అండ్ రన్ కేసుల శిక్షలతో ముడిపడిన నిబంధనపై మంగళవారం రాత్రి ఓ ప్రకటన చేసింది. హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించిన నిబంధనలను తాము ఇంకా అమలు చేయలేదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా వెల్లడించారు. దేశంలోని ప్రముఖ ట్రాన్స్‌పోర్టు సంఘాలతో హిట్ అండ్ రన్ కేసు కొత్త నిబంధనలపై చర్చించిన తర్వాతే వాటి అమలుపై తుది నిర్ణయాన్ని తీసుకుంటామని తెలిపారు. ట్రక్కు డ్రైవర్లు సమ్మె విరమించాలని ఆయన కోరారు. అజయ్ భల్లా ప్రకటనతో ట్రక్కు డ్రైవర్లు సమ్మెను విరమించుకుంటున్నారు. హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్లకు రూ.7 లక్షల జరిమానా, గరిష్ఠంగా పదేళ్ల జైలుశిక్ష విధించవచ్చనే కొత్త నిబంధనల్ని అమలు చేయకూడదంటూ దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు సమ్మె బాట పట్టారు. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటన విడుదల చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
- బ్రిటీష్ కాలంలో తీసుకొచ్చిన మూడు క్రిమినల్ కోడ్ చట్టాల పేర్లు.. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఈ మూడింటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం అమల్లోకి వచ్చాయి.
- ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయ సంహిత అమల్లోకి వచ్చేసింది.
- ఐపీసీ అమల్లో ఉండగా హిట్ అండ్ రన్ కేసులో(Hit and Run Case) డ్రైవర్లకు విధించే గరిష్ట శిక్ష కేవలం రెండు సంవత్సరాలే.
- భారతీయ న్యాయ సంహితలో ఈ శిక్షను గరిష్ఠంగా పదేళ్లకు పెంచారు. రూ.7 లక్షల జరిమానాను కూడా ప్రతిపాదించారు. దీనిపై డ్రైవర్ల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనలు చేస్తున్నాయి. ఇలాంటి కేసుల్లో డ్రైవర్లకు విధించే శిక్షలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి.