Himachal Pradesh: తనకు టికెట్ ఇవ్వలేదని వేదికపై విలపించిన మాజీ ఎంపీ… ఓదార్చిన జేపీ నడ్డా..!!
- By hashtagu Published Date - 11:18 AM, Mon - 31 October 22

హిమచల్ ప్రదేశ్ లో నవంబర్ 12 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అయిన బీజేపీ కాంగ్రెస్ లు ప్రచారం మొదలు పెట్టాయి. అయితే ఈసారి ఎన్నికల్లో టికెట్లు ఆశించిన అగ్రనేతలను పక్కన పెట్టారు. టికెట్ ఆశించి భంగపడిన నేతలంతా భావోద్వేగానికి లోనవుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ కులు అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ మాజీ అభ్యర్థి మహేశ్వర్ సింగ్ శనివారం జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. కులులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన విజయ్ సంకల్ప్ ర్యాలీలో ఆయన కన్నీరు మున్నీరయ్యారు.
వాస్తవానికి మహేశ్వర్ సింగ్ కు కులు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ఇచ్చింది. అయితే నామినేషన్ చివరిరోజు అతని స్థానంలో కులు నుంచి మరొక అభ్యర్థి నరోత్తమ్ ఠాకూర్ ను నిలబెట్టింది బీజేపీ. దీంతో మహేశ్వర్ సింగ్ షాక్ కు గురయ్యారు. బీజేపీ విజయ్ సంకల్ప్ ర్యాలీ సందర్భంగా వేదికపై కూర్చున్న మహేశ్వర్ సింగ్ తన బాధను దాచుకోలేక ప్రసంగిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రసంగిస్తూనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్టీ నాయకులు ఆయన్ను ఓదార్చి కూర్చోబెట్టారు. జేపీ నడ్డా… మహేశ్వర్ సింగ్ భుజంపై చేయి వేసి ఓదార్చారు.
Also Read: Bharat Jodo Yatra : రాహుల్ గాంధీని సాయిబాబాతో పోల్చిన రాబర్ట్ వాద్రా…!!
మహేశ్వర్ సింగ్ ఒక్కరే కాదు చాలామంది సీనియర్ నేతలకు ఈసారి బీజేపీ టికెట్ ఇవ్వలేదు. మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ ను కూడా పక్కన పెట్టింది. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో సుజన్ పూర్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.