New Parliament : ఇకపై కొత్త భవనమే భారత పార్లమెంటు.. కేంద్ర సర్కారు గెజిట్
New Parliament : కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉదయం కీలక ప్రకటన చేసింది.
- By Pasha Published Date - 09:51 AM, Tue - 19 September 23

New Parliament : కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉదయం కీలక ప్రకటన చేసింది. కొత్తగా నిర్మించిన భవనమే ఇకపై భారత పార్లమెంటుగా ఉంటుందని పేర్కొంటూ ఓ గెజిట్ ను రిలీజ్ చేసింది. ఈరోజు నుంచి కొత్త పార్లమెంటు భవనంలోనే సభా కార్యకలాపాలు జరుగనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 1.15 గంటలకు లోక్‌సభ, 2.15 గంటలకు రాజ్యసభ ప్రారంభమవుతాయి. అంతకుముందు పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో కొత్త పార్లమెంట్ భవనంలో సెషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగనుంది. దాదాపు గంటన్నరపాటు జరుగనున్న ఈ కార్యక్రమం జాతీయ గీతంతో ప్రారంభం అవుతుంది. ప్రారంభం ముగించే టైంలో కూడా జాతీయ గీతాన్ని ఆలపిస్తారు.
Also read : 665 Crores – Fighter Jet Missing : 665 కోట్ల యుద్ధ విమానం మిస్సింగ్.. ఆచూకీ చెప్పాలని ప్రజలకు పిలుపు
ఈసందర్భంగా లోక్ సభ, రాజ్యసభ సభ్యులను ఉద్దేశించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రసంగిస్తారు. ఆయనతోపాటు సీనియర్ పార్లమెంటేరియన్లు బీజేపీ ఎంపీ మేనకా గాంధీ, జేఎంఎం లీడర్ శిబు సోరెన్ కూడా మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమానికి ముందు పార్లమెంటులోని ఎంపీలంతా కలిసి గ్రూప్ ఫొటోలు దిగనున్నారు. పాత పార్లమెంటు భవనం లోపలి ప్రాంగణంలో రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు వేర్వేరుగా.. అంతా కలిసి మరో ఫొటో కూడా దిగుతారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సోమవారం రోజు జరిగిన సెషన్ లోనే 96 ఏళ్ల చరిత్ర కలిగిన పాత పార్లమెంటు భవనానికి వీడ్కోలు (New Parliament) పలికారు. అక్కడ జరిగిన చివరి సెషన్ అదే.