Four Tigers Dead: అభయారణ్యంలో నాలుగు పులి పిల్లలు మృతి
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని తడోబా అంధారి టైగర్ రిజర్వ్ (టీఏటీఆర్)లోని బఫర్ జోన్‌లో శనివారం నాలుగు పులి పిల్లలు చనిపోయాయి.
- Author : Gopichand
Date : 04-12-2022 - 10:50 IST
Published By : Hashtagu Telugu Desk
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని తడోబా అంధారి టైగర్ రిజర్వ్ (టీఏటీఆర్)లోని బఫర్ జోన్‌లో శనివారం నాలుగు పులి పిల్లలు చనిపోయాయి. అటవీశాఖ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. పులి పిల్లలపై గాయపడిన గుర్తులు కనిపించాయి. వాటిని పులి చంపిందని తేలింది. శనివారం ఉదయం బఫర్ జోన్‌లోని శివ్‌ని ఫారెస్ట్ రేంజ్‌లో మూడు నుంచి నాలుగు నెలల వయసున్న రెండు మగ, రెండు ఆడ పిల్లల మృతదేహాలు లభ్యమైనట్లు రిజర్వ్‌లోని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ జితేంద్ర రామ్‌గావ్‌కర్ తెలిపారు.
కంపార్ట్‌మెంట్ నంబర్ 265లో మృతదేహాలు కనిపించాయని, నవంబర్ 30న పులి (టి-75) చనిపోయిందని ఆయన తెలిపారు. శివాని రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్, ఇతర సిబ్బందితో కూడిన సెర్చ్ టీం డిసెంబరు 2 నుండి పిల్లల కదలికలను ట్రాక్ చేసింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని తడోబా అంధారి టైగర్ రిజర్వ్ (టీఏటీఆర్)లో వేర్వేరు చోట్ల రెండు పులులు చనిపోయాయి. టైగ్రెస్ T-60 గురువారం ఉదయం జిల్లా కేంద్రానికి 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న TATR ‘బఫర్ జోన్’లోని మొహర్లీ రేంజ్ కంపార్ట్‌మెంట్ 189లో చనిపోయినట్లు కనుగొనబడింది. తనిఖీలో పులి పంజా ముద్రలు కూడా లభించాయని రామ్‌గావ్‌కర్ తెలిపారు.
దాదాపు ఆరు, ఏడు నెలల వయసున్న పులి పోరాటంలో చనిపోయి ఉండవచ్చు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ట్రాన్సిట్ ట్రీట్‌మెంట్ సెంటర్‌కు తరలించారు. అంతకుముందు పెద్దపులి T-75 కళేబరం బుధవారం మధ్యాహ్నం శివ్ని రేంజ్‌లోని ‘బఫర్ జోన్’లో కుళ్ళిన స్థితిలో కనుగొనబడింది. T-75 వయస్సు 14-15 సంవత్సరాలు వృద్ధాప్యం కారణంగా మరణించి ఉండవచ్చని అధికారులు తెలిపారు.