Ayodhya Airport BluePrint : ‘మర్యాద పురుషోత్తమ శ్రీరామ’ ఎయిర్‌పోర్టు.. డిసెంబరు నుంచే సేవలు
Ayodhya Airport BluePrint : వచ్చే ఏడాది జనవరి 22-24 మధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్యలో భవ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరుగనుంది.
- By Pasha Published Date - 05:12 PM, Sun - 24 September 23

Ayodhya Airport BluePrint : వచ్చే ఏడాది జనవరి 22-24 మధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్యలో భవ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరుగనుంది. అయితే అంతకంటే ముందే అయోధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే విమానశ్రయం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అంతా సజావుగా సాగితే ఈ ఏడాది డిసెంబరులోనే అయోధ్య విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు మొదలయ్యే అవకాశముందని సివిల్ ఏవియేషన్ శాఖ చెబుతోంది. ఈ ఎయిర్ పోర్టుకు మర్యాద పురుషోత్తమ శ్రీరామ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా పేరు పెట్టనున్నారు.
Also read : Hyderabad: ఓయూ యూనివర్సిటీలో బర్తడే సెలబ్రేషన్స్ నిషేధం
బ్లూప్రింట్‌లో ఏముంది ?
ఈ నూతన ఎయిర్ పోర్టు విస్తీర్ణంలోనూ ఇప్పుడున్న విమానాశ్రయం కంటే ఐదు రెట్లు పెద్దదిగా ఉంటుందని విమానయాన శాఖ అధికారులు విడుదల చేసిన బ్లూప్రింట్‌లో ప్రస్తావించారు. కనీసం 500 మంది ప్యాసింజర్ల వరకు సౌకర్యవంతంగా ఉండేలా ఈ ఎయిర్ పోర్టును నిర్మిస్తున్నారు. ఇందులో 2200 మీటర్ల పొడవైన రన్‌వే ఉంటుంది. ఒకేసారి నాలుగు విమానాలను నిలిపే సామర్థ్యముంది. అయోధ్య ఎయిర్ పోర్టు మొదటి దశ నిర్మాణ పనులు పూర్తయ్యాయని అంటున్నారు. ఇక్కడి నుంచి తొలివిడతగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు హైదరాబాద్ నగరాలకు విమాన సర్వీసులు నడుస్తాయి.
రెండో దశలో ఏం చేస్తారంటే..
ఇక రెండో దశలో ఈ ఎయిర్‌పోర్టులో మరిన్ని సౌకర్యాలను కల్పిస్తారు. 30,000 చ.మీటర్ల విస్తీర్ణంలో నిర్మించబోయే నూతన టెర్మినల్ భవనం బిజీ సమయాల్లో కనీసం 3200 మంది ప్రయాణికులకు సౌకర్యం కల్పించనుంది. రన్ వేను 2200 మీటర్ల నుంచి 3125 మీటర్ల వరకు పొడిగిస్తారు. రెండో దశలో నిర్మించబోయే టెర్మినల్ వద్ద కనీసం ఎనిమిది ఏ-321 విమానాలను పార్క్ చేయవచ్చని బ్లూప్రింట్‌లో స్పష్టమవుతోంది. రామమందిరం నిర్మాణం పూర్తికాక ముందే ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మందిరం నిర్మాణం పూర్తయ్యేసరికి భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశముండటంతో రెండో టెర్మినల్ నిర్మాణం తప్పనిసరి (Ayodhya Airport BluePrint) అని నిర్ణయించారు.