Fire Accident : ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి
Fire Accident : ఆసుపత్రి ట్రామా సెంటర్ ఇన్చార్జ్ మాట్లాడుతూ.. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. మంటలు చెలరేగిన సమయంలో ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితి ముందే అత్యంత
- By Sudheer Published Date - 09:45 AM, Mon - 6 October 25

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని సవాయి మాన్ సింగ్ (SMS) ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. ఆస్పత్రి ఐసీయూ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, పొగలు వ్యాపించడంతో రోగులు, వైద్యసిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఆరుగురు పేషెంట్లు దుర్మరణం చెందడం తీవ్ర విషాదంగా మారింది.
ఆసుపత్రి ట్రామా సెంటర్ ఇన్చార్జ్ మాట్లాడుతూ.. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. మంటలు చెలరేగిన సమయంలో ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితి ముందే అత్యంత విషమంగా ఉందని, వారిని వేరే ఫ్లోరుకు తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారని ఆయన వివరించారు. వెంటనే సిబ్బంది స్పందించినప్పటికీ పొగ ఎక్కువగా ఉండటంతో తరలింపులో ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఈ ఘటనతో ఆసుపత్రుల్లో అగ్నిప్రమాద భద్రతా ప్రమాణాలపై మరలా ప్రశ్నలు తలెత్తాయి. అత్యవసర విభాగాల్లో విద్యుత్ సరఫరా, షార్ట్ సర్క్యూట్ నిరోధక చర్యలు, సిబ్బందికి తక్షణ చర్యలపై శిక్షణ వంటి అంశాలు తప్పనిసరి చేయాల్సిన అవసరం స్పష్టమవుతోంది. రోగులు అత్యవసర పరిస్థితుల్లో ఉండే ఐసీయూలలో భద్రతా ప్రమాణాలు నిర్లక్ష్యం చేయడం ఎంతటి ప్రాణనష్టానికి దారితీస్తుందో ఈ ఘటన చూపించింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, ఆసుపత్రి అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం.