Earthquake : తెల్లవారుజామున భూకంపం.. రోడ్లపైకి జనం పరుగులు
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో భూకంపం సంభవించింది.
- By Pasha Published Date - 10:02 AM, Sun - 2 June 24

Earthquake : ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని చందేల్ నగరంలో ఇవాళ తెల్లవారుజామున 2.28 గంటలకు స్వల్ప భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైంది. భూకంప కేంద్రం 77 కిలోమీటర్ల లోతులో ఉందని గుర్తించారు. ఈవివరాలను నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. చందేల్‌లో భూప్రకంపనలను (Earthquake) ఫీలైన కొందరు ప్రజలు ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. తెల్లవారే వరకు రోడ్లపైనే గడిపారు. అయితే భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదు.
We’re now on WhatsApp. Click to Join
మరోవైపు మణిపూర్‌ను వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. ఈ తరుణంలో భూకంపం కూడా సంభవించడంతో ప్రజలు కలత చెందుతున్నారు. దాదాపు కొన్ని నెలల పాటు హింసాకాండతో, నరమేధంతో మణిపూర్ అట్టుడికింది. ఇప్పుడు వర్షాలు, వరదలు, భూకంపాలు ఈ రాష్ట్రాన్ని అలుముకోవడం గమనార్హం. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాన్ ప్రభావం ఇంకా మణిపూర్‌పై కనిపిస్తోంది. అందుకే అక్కడ పలుచోట్ల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని చోటాబెక్రా వద్ద బరాక్ నది దాని ప్రమాద స్థాయి 26.2 మీటర్ల కంటే 2.07 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. దీంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
Also Read : Mahabubnagar MLC Election : కౌంటింగ్ షురూ.. కాసేపట్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం
మణిపూర్‌లో వరదల పరిస్థితి
- మణిపూర్‌లో భారీ వర్షాలు, వరదల కారణంగా గత వారం రోజుల్లో ఐదుగురు మరణించారు.
- లక్షలాది మందిపై వరదల ప్రభావం పడింది.
- ఇంఫాల్ నగరం నుంచి ప్రవహించే చాలా నదుల్లో నీటి మట్టాలు వేగంగా పెరుగుతున్నాయి.
- రాష్ట్రంలోని 255 గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. 16,364 ఇళ్లు దెబ్బతిన్నాయి. వరదల్లో చిక్కుకున్న 20,504 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 522 హెక్టార్ల పంట ప్రాంతాలు నష్టపోయాయి.
- మణిపూర్‌లోని కొండ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో గత మూడు రోజుల్లో 292 కొండచరియలు విరిగిపడ్డాయి.
- బాధితుల కోసం 51 సహాయక శిబిరాలను ప్రారంభించారు.