RG Kar Rape Case : డాక్టర్ హత్యాచార కేసు.. తీర్పు వెలువరించిన కోర్టు
ఈ కేసులో ప్రత్యేక కోర్టుకు సీబీఐ ఛార్జిషీట్ సమర్పించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జ్‌షీట్‌లో చేర్చింది.
- By Latha Suma Published Date - 03:46 PM, Sat - 18 January 25

RG Kar Rape Case : కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసులో కోల్‌కతా సీల్దా కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్‌ను దోషిగా తేల్చింది. ఈ నేపథ్యంలోనే అతడికి సోమవారం రోజున శిక్షను ఖరారు చేయనున్నట్లు తెలిపింది. ఈ కేసులో ప్రత్యేక కోర్టుకు సీబీఐ ఛార్జిషీట్ సమర్పించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జ్‌షీట్‌లో చేర్చింది.
2024 ఆగస్టు 9న ఆర్జీకర్ మెడికల్ కళాశాలలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై.. పోలీస్ వాలంటీర్‌గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన అనంతరం దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సంజయ్ రాయ్‌ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశాయి. దీంతో పోలీసులు సీసీటీవీ కెమెరాల సాయంతో సంజయ్ రాయ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఈ కేసుపై సీబీఐ విచారణ చేపట్టింది. ఈ కేసులో మరికొంత మందిని కూడా అరెస్ట్ చేశారు. ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్.. తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్ ఇంఛార్జ్ అభిజిత్ మండల్ కూడా అరెస్ట్ అయ్యారు. సాక్ష్యాలు తారుమారు చేశారన్న ఆరోపణలపై వారు అరెస్ట్ కాగా.. తర్వాత వారికి ప్రత్యేక కోర్టులో బెయిల్ వచ్చింది.
ఇకపోతే.. బాధితురాలి తండ్రి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం కోర్టులో జరుగుతున్న విచారణకు సీబీఐ తమను పిలవలేదని చెప్పారు. తమ లాయర్‌ను కూడా కోర్టుకు వెళ్లొద్దని చెప్పారంటూ పేర్కొన్నారు. ఈ కేసుపై విచారణ చేపట్టినప్పటి నుంచి సీబీఐ అధికారులు ఒకట్రెండు సార్లు మాత్రమే తమ ఇంటికి వచ్చారని తెలిపారు. విచారణ ఎంతవరకు వచ్చిందని అడిగితే.. ఇంకా జరుగుతోందని మాత్రమే చెబుతున్నారని తమకు ఎలాంటి వివరాలు చెప్పలేదని వాపోయారు. కాగా, ఈ ఘటనతో కోల్‌కతాలోని జూనియర్ డాక్టర్లు మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా జూడాలు తీవ్ర ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. ఈ ఘటనకు కారణమైన దోషులను వీలైనంత త్వరగా పట్టుకుని శిక్షించాలని డిమాండ్లు చేస్తూ.. దీక్షలు, నిరసనలు చేశారు.