EVMs Memory : ఈవీఎంలలోని డేటాపై ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈవీఎంలకు(EVMs Memory) సంబంధించి ఎలాంటి నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నారని ఈసందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
- By Pasha Published Date - 06:19 PM, Tue - 11 February 25

EVMs Memory : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎంలలోని డేటాను తొలగించకూడదని, వాటిలోకి కొత్త డేటాను జోడించకూడదని దేశ సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఈవీఎంలను పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. ‘‘ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కూడా ఈవీఎంలలో డేటాను తొలగించరాదు’’ అని పేర్కొంటూ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంలో విచారణ జరిగింది. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈవీఎంలకు(EVMs Memory) సంబంధించి ఎలాంటి నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నారని ఈసందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల తర్వాత ఈవీఎంల నుంచి డేటాను తొలగించడానికి ఎలాంటి ప్రక్రియను అనుసరిస్తారో తెలుపుతూ, 15 రోజుల్లోగా తమకు నివేదికను సమర్పించాలని ఈసీకి నిర్దేశించింది.
Also Read :Monkey Catch : సర్పంచ్ ఎన్నికలు.. కోతులపై కీలక అప్‌డేట్
వీవీ ప్యాట్ స్లిప్పుల వ్యవహారంలో..
ఈవీఎం-వీవీప్యాట్ క్రాస్ వెరిఫికేషన్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను గతంలో సుప్రీంకోర్టు రెజెక్ట్ చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో (ఈవీఎం) నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల(వీవీ ప్యాట్) స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లను ఆనాడు సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈవీఎంలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ యూనిట్‌ను సీల్ చేయాలని అప్పట్లో ఆర్డర్ ఇచ్చింది. దాన్ని కనీసం 45 రోజుల పాటు భద్రపర్చాలని నిర్దేశించింది. ఫలితాల ప్రకటన తర్వాత అభ్యర్థులు ఏడు రోజుల్లోగా తమ అభ్యంతరాలను తెలియజేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
Also Read :WhatsApp Video Calls : ఇక ఆ యాప్ నుంచి కూడా వాట్సాప్ వీడియో కాల్స్
అభ్యంతరాలు వచ్చినప్పుడు..
అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వచ్చినప్పుడు.. ఇంజినీర్ల బృందం మైక్రో కంట్రోలర్ ఈవీఎంలో బర్న్ చేసిన మెమొరీని తనిఖీ చేయాలని సూచించింది. ఈ వెరిఫికేషన్‌కు అయ్యే ఖర్చులను అభ్యంతరాలు లేవనెత్తిన అభ్యర్థులే చెల్లించాలని స్పష్టం చేసింది. ఈవీఎం ట్యాంపర్ అయినట్లు తేలితే, సదరు అభ్యర్థికి ఖర్చులను తిరిగి చెల్లించాలని సుప్రీంకోర్టు అప్పట్లో తెలిపింది.