Devendra Fadnavis : మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణ స్వీకారం
Devendra Fadnavis : గవర్నర్ రాధాకృష్ణన్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఫడణవీస్ ఈ పదవికి ఎంపికవ్వడం ద్వారా మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ ఆధిపత్యం కొనసాగుతుందని స్పష్టం చేశారు
- By Sudheer Published Date - 06:38 PM, Thu - 5 December 24
మహారాష్ట్ర(Maharashtra)లో రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం (Devendra Fadnavis sworn in as Chief Minister) చేశారు. ముంబైలోని ఆజాద్ మైదాన్లో (Azad Maidan) గవర్నర్ రాధాకృష్ణన్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఫడణవీస్ ఈ పదవికి ఎంపికవ్వడం ద్వారా మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ ఆధిపత్యం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన 12 రోజులకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగడం విశేషం. ముఖ్యమంత్రి పదవి విషయంలో శివసేనతో తలెత్తిన విభేదాల వల్ల ప్రతిష్టంభన చోటుచేసుకుంది. చివరికి శివసేనకు డిప్యూటీ సీఎం పదవిని అప్పగించి, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, శివరాజ్‌సింగ్ చౌహాన్, రాందాస్ అథవాలే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
అలాగే, వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్-అంజలి దంపతులు, బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్‌సింగ్ సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో 50 వేల మందికి పైగా ప్రజలు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. బీజేపీ విజయాన్ని ఆస్వాదిస్తూ కార్యకర్తలు సంబరాలు జరిపారు. దేవేంద్ర ఫడణవీస్ మహారాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని ప్రమాణ స్వీకార సందర్భంగా తెలిపారు. రైతు సంక్షేమం, మెరుగైన నీటిపారుదల, మహిళా సాధికారతపై ప్రభుత్వ ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. కోవిడ్ తర్వాత అభివృద్ధిని పుంజుకునే దిశగా మహారాష్ట్రను ముందుకు నడిపించడానికి తన ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు.
దేవేంద్ర ఫడ్నవీస్ విషయానికి వస్తే..
దేవేంద్ర ఫడ్నవీస్ తండ్రి గంగాధర్ ఫడ్నవీస్ జనసంఘ్, బీజేపీలో చురుగ్గా పని చేశారు. 1989లో ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించిన ఫడ్నవీస్ 22 ఏండ్ల వయసులోనే నాగ్‌పూర్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 1997లో 27ఏండ్లకే మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1999 నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చిన ఆయన.. 2014లో మొదటిసారి మహారాష్ట్ర సీఎంగా ఎన్నికయ్యారు. 2019 నవంబర్ 23న రెండోసారి సీఎంగా ప్రమాణం చేశారు. అయితే, సరిపడా శాసనసభ్యుల బలం లేకపోవడంతో మూడు రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది. 2022 జూన్‌లో శివసేనలో షిండే తిరుగుబాటు చేసి సీఎం సీఎంగా బాధ్యతలు చేపట్టారు. షిండే కేబినెట్‌లో ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు.
Read Also : Pushpa 2 Review & Rating : పుష్ప 2 రివ్యూ & రేటింగ్