MCD Polls: టికెట్ ఇవ్వలేదని ఆప్ నేత ఏం చేశాడంటే..?
ఢిల్లీలోని శాస్త్రి పార్క్ మెట్రో స్టేషన్ సమీపంలో ఆప్ మాజీ కౌన్సిలర్ హసీబుల్ హసన్ హల్ చల్ చేశాడు.
- By Gopichand Published Date - 09:18 PM, Sun - 13 November 22

ఢిల్లీలోని శాస్త్రి పార్క్ మెట్రో స్టేషన్ సమీపంలో ఆప్ మాజీ కౌన్సిలర్ హసీబుల్ హసన్ హల్ చల్ చేశాడు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ టికెట్ లభించకపోవడంతో హైటెన్షన్ వైర్ టవర్ ఎక్కి హంగామా చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతడిని సురక్షితంగా కిందకి తీసుకొచ్చారు.
రాబోయే MCD (మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ) ఎన్నికల్లో పోటీ చేయడానికి టిక్కెట్ నిరాకరించిన తరువాత ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మాజీ కౌన్సిలర్ ఆదివారం ట్రాన్స్‌మిషన్ టవర్ పైకి ఎక్కి హల్ చల్ చేశాడు. ఎత్తైన టవర్ ఎక్కిన హసన్, తన ఫోన్లోనే ఫేస్బుక్ లైవ్ పెట్టాడు. ఆప్ నేతలపై ఆరోపణలు చేస్తూ తనకు టికెట్ ఇవ్వకపోతే టవర్ మీద నుంచి దూకి చనిపోతానని బెదిరించాడు. ఆప్ మాజీ కౌన్సిలర్ హసీబ్ ఉల్ హసన్ శాస్త్రి పార్క్ మెట్రో స్టేషన్ సమీపంలోని టవర్ బీమ్‌లను పట్టుకుని తన టికెట్ ను వేరొకరికి రూ.2 కోట్లకు విక్రయించారని ఆరోపించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అతడిని సముదాయించి కిందకు దించారు.
ఆమ్ ఆద్మీ పార్టీలో ‘క్యాష్ ఫర్ టికెట్’ కుంభకోణం జరుగుతోందని, రాబోయే MCD ఎన్నికలకు తన వద్ద డబ్బు లేనందున పార్టీ తనకు టికెట్ నిరాకరించిందని ఆయన ఆరోపించారు. తనకు టికెట్ నిరాకరించిన తర్వాత కూడా తన పత్రాలను తిరిగి ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఆప్ సీనియర్ నాయకులైన దుర్గేష్ పాఠక్, అతిషి, ఇతరుల పేర్లను ఆయన పేర్కొన్నారు.
కాగా.. ఎంసీడీ ఎన్నికల అభ్యర్థుల రెండో, చివరి జాబితాను ఆప్ శనివారం రాత్రి విడుదల చేసింది. అన్ని సర్వేలలో అగ్రస్థానంలో నిలిచిన తర్వాత రెండవ జాబితాలో పాత పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత లభించడంతో ప్రజల ఎంపిక ఆప్ వాయిస్‌గా మారిందని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. టికెట్లు పంపిణీ చేయడానికి ముందు AAP తమ అభ్యర్థుల ఎంపికపై పౌరుల అభిప్రాయాన్ని పొందడానికి సర్వేలు నిర్వహించినట్లు పేర్కొంది. ఢిల్లీలోని 250 వార్డుల మున్సిపల్ కార్పొరేషన్‌కు డిసెంబర్ 4న, ఓట్ల లెక్కింపు డిసెంబర్ 7న జరగనుంది.