ఫుల్ టైం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా..జీ 23కి జలక్ ఇచ్చిన సీడబ్ల్యూసీ
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ ఇక నుంచి ఫుల్ టైం కాబోతున్నారు. ఆ విషయాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఆమె సంకేతాలిచ్చేశారు. ఇప్పటి వరకు తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. రాహుల్ గాంధీ ఆ పదవికి రాజీనామా చేసిన తరువాత తాత్కాలికంగా సోనియా కొనసాగుతున్నారు.
- By Hashtag U Published Date - 03:23 PM, Mon - 18 October 21

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ ఇక నుంచి ఫుల్ టైం కాబోతున్నారు. ఆ విషయాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఆమె సంకేతాలిచ్చేశారు. ఇప్పటి వరకు తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. రాహుల్ గాంధీ ఆ పదవికి రాజీనామా చేసిన తరువాత తాత్కాలికంగా సోనియా కొనసాగుతున్నారు. ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఫుల్ టైం అధ్యక్షురాలిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. సంస్థాగత ఎన్నికలు ఈ ఏడాది జూన్ లో వాయిదా పడిన విషయం విదితమే. వాటిని వెంటనే జరిపించాలని సీడబ్ల్యూసీ మీటింగ్ లో తీర్మానం జరిగింది.
సోనియా నాయత్వాన్ని ప్రశ్నించిన జీ 23 నేతలు చాల వరకు ఈ సమావేశానికి హాజరయ్యారు. వాళ్లను ఉద్దేశించి సోనియా మాట్లాడారు. స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఈ సమావేశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఏదైనా నాలుగు గోడల మధ్య ఉండాలని, మీడియాకు ఎక్కి అనైక్యతను బయటపెట్టుకోవద్దని హితవు పలికారు.
వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని సీడబ్లూసీ అభిప్రాయపడింది. త్వరలోనే పంజాబ్, యూపీ, గుజరాత్ ఇతర రాష్ట్రాల ఎన్నికలు వస్తాయని, వాటికి సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఆ ఎన్నికల్లో పూర్తి స్థాయి సమర్థతను ప్రదర్శించేలా క్యాడర్ ను ఉత్సాహ పరచాలని సమావేశం తీర్మానం చేసింది. సంస్థాగత ఎన్నికలకు పూర్తి అయ్యే వరకు తానే అధ్యక్షురాలిగా పూర్తిగా పనిచేస్తాననే సంకేతి సోనియా ఇచ్చేశారు.
ఏఐసీసీ అధ్యక్షునిగా రాహుల్ ను మళ్లీ నియమించాలని చాలా మంది నేతలు డిమాండ్ చేశారు. ఆయా రాష్ట్రాల నేతల కూడా రాహుల్ నాయకత్వాన్ని కోరుతున్నాయి. కానీ, సోనియా మాత్రం చాలా రాజకీయ పరికత్వతో ఆలోచించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆమె కొనసాగేలా సంకేతాలు ఇచ్చేశారు. ఒక వేళ ఇప్పుడు రాహుల్ ను అధ్యక్షునిగా నియమించినప్పటికీ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఫలితాలు ఆశాజనకంగా లేకపోతే, మళ్లీ సంక్షోభ వస్తుందని సోనియా ముందే గ్రహించారు. అందుకే, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వరకు సోనియా అధ్యక్షురాలిగా చురుగ్గా పాల్గొంటారు.
సోనియా నాయకత్వంలో వ్యవసాయ చట్టాల మీద పోరు జరిగింది. కోవిడ్ -19 సందర్భంగా కేంద్రం వైఫల్యాలపై పార్లమెంట్ లోనూ, పార్లమెంట్ బయటా బాగా పనిచేసింది. అణగారిన వర్గాలపై జరిగిన ఆకృత్యాలపై పోరాటం బాగా చేయగలిగామని సీడబ్ల్యూసీ భావిస్తోంది. సోనియా నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమాలు అన్నీ విజయవంతం అయ్యాయని, అందుకే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా ఆమె నాయకత్వంలోనే జరుగుతాయని సమావేశం తీర్మానం చేసింది. గులాంనబీ ఆజాద్ లాంటి జీ 23 నేతల కూడా సోనియా నాయకత్వాన్ని సంపూర్ణంగా బలపర్చుతామని వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీకి తొలి నుంచి ఐకమత్యం కొరత ఉంది. నేతలు అందరూ ఐక్యంగా ఉండాలని సోనియా సూచించారు. ఏక కంఠంతో పనిచేయాలని కోరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ ఐక్యంగా పనిచేస్తేనే ఫలితాలు ఉంటాయని తేల్చి చెప్పారు. క్రమశిక్షణ తప్పిన వాళ్లపై కఠిన చర్యలు ఉంటాయని సోనియా కరాఖండిగా చెప్పారు. సో..ఇక కాంగ్రెస్ పార్టీ కొత్త పంథాన నడవబోతుందన్నమాట. సోనియా ఈసారి ఎలాంటి క్రమశిక్షణతో కాంగ్రెస్ ను నడిపిప్తారో..చూద్దాం.