Uttarakhand Chief Minister : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఎవరనేదానిపై కొనసాగుతున్న అనిశ్చితి..?
- By HashtagU Desk Published Date - 09:18 AM, Sat - 12 March 22

ఉత్తరఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తన సొంత నియోజకవర్గం ఖతిమాలో ఓటమిపాలైయ్యారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ సీఎం ఓడిపోవడంతో తదుపరి సీఎం ఎవరనే దానిపై అనిశ్చితి నెలకొంది. రాష్ట్ర అసెంబ్లీలో 70 స్థానాలకు గానూ 47 స్థానాల్లో పార్టీ విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీలోని ఒక వర్గం నేతలు సీఎంగా బాధ్యతలు చేపట్టే ఇతర నేతల పేర్లపై చర్చలు జరపడం ప్రారంభించారు. గత 12 నెలల్లో ఇద్దరు ముఖ్యమంత్రులను తొలగించిన తర్వాత ప్రభుత్వాన్ని సుస్థిరపరచడంతోపాటు పార్టీని విజయపథంలో పుష్కరసింగ్ ధామీ నడిపించారు.
నాలుగు సంవత్సరాల పదవీకాలం తర్వాత త్రివేంద్ర సింగ్ రావత్ మార్చి 9 2021న రాజీనామా చేశారు. కొత్త ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్‌కు మార్గం సుగమం చేసారు. జూలై 3న 115 రోజుల అధికారం తర్వాత ఆయన కూడా రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ తరువాత పుష్కర్ సింగ్ ధామి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.ఈయన ఓటమితో ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రిగా పలువురు పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. ఈ పేర్లలో మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, అజయ్ భట్, సత్పాల్ మహరాజ్, అనిల్ బలూని, ధన్ సింగ్ రావత్ లు రేస్ లో ఉన్నారు.
అయితే నాయకత్వంలో మార్పు ఉండదని సీనియర్ నేతలు అంటున్నారు.ఈ విజయం ముఖ్యమంత్రిగా ధామీ ఆధ్వర్యంలో వచ్చిందని.. రాష్ట్రవ్యాప్తంగా ఆయన పని తీరు కారణంగా ఇది జరిగిందన్నారు. ఆయన తన నియోజకవర్గంలో సమర్థవంతంగా ప్రచారం చేయలేకపోయినందున ఓడిపోయినట్లు తెలిపారు. తదుపరి సీఎంపై పార్టీ హైకమాండ్ ఆధ్వర్యంలో జరిగే శాసనసభా పక్ష సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు దేవేంద్ర భాసిన్ తెలిపారు. పార్టీ ఇద్దరు సీనియర్ నాయకులను పరిశీలకులుగా ఇక్కడకు పంపుతోందని..వారు కొత్త ఎమ్మెల్యేలు, సీనియర్ పార్టీ నాయకులతో చర్చలు జరుపుతారని తెలిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థిపై వారి అభిప్రాయాన్ని తెలుసుకుంటారని భాసిన్ చెప్పారు. అయితే శాసనసభా పక్ష సమావేశానికి తేదీని నిర్ణయించలేదన్నారు.
కొత్తగా ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్యేలు చంపావత్ నుండి కైలాష్ గహ్తోరి మరియు జగేశ్వర్ నుండి మోహన్ సింగ్ మెహ్రా, ధామికి తమ మద్దతును ప్రకటించారు. పార్టీ అతన్ని మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే, అతని కోసం తమ స్థానాలను ఖాళీ చేస్తామని ప్రకటించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఓడిపోవడం దురదృష్టకరమని.. ఆయన నాయకత్వంలో పార్టీ ఉత్తరాఖండ్‌లో అధికారాన్ని నిలుపుకుందని కైలాష్ గహ్తోర్తి తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ ఆయనను సీఎంగా చేస్తే ఆయన పోటీ చేసి అసెంబ్లీకి చేరుకునేలా తన సీటును ఇస్తానన్నారు.