CIA Chief – India : ఇండియాకు సీఐఏ చీఫ్‌ను పంపిన బైడెన్.. ఎందుకు ?
CIA Chief - India : అమెరికా పెత్తనం చివరకు భారత్ దాకా చేరింది. భారత్‌పైనా ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నాల్లో జో బైడెన్ సర్కారు నిమగ్నమైంది.
- By Pasha Published Date - 06:15 PM, Fri - 1 December 23

CIA Chief – India : అమెరికా పెత్తనం చివరకు భారత్ దాకా చేరింది. భారత్‌పైనా ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నాల్లో జో బైడెన్ సర్కారు నిమగ్నమైంది. ఖలిస్తాన్ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు ఓ భారతీయ ఉన్నతాధికారి కుట్ర పన్నారని ఆరోపించిన అమెరికా.. దీనిపై దర్యాప్తు కోసం ఏకంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) చీఫ్ విలియం బర్న్స్‌ను ఆగస్టులో భారత్‌కు పంపిందట. సీఐఏ అనేది అమెరికా గూఢచార విభాగం. ఈ పర్యటన సందర్భంగా రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ చీఫ్(రా) రవి సిన్హాతో ఆయన భేటీ అయ్యారట. రా అనేది భారత గూఢచార విభాగం. ‘‘పన్నూ హత్యకు జరిగిన కుట్రపై విచారణ అవసరం. దానికి భారత్ సహకరించాలి’’ అని రా చీఫ్‌ను సీఐఏ చీఫ్ కోరినట్లు తెలిసింది. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా భారత్ నుంచి స్పష్టమైన హామీని ఆయన కోరారంటూ తాజాగా వాషింగ్టన్ పోస్టులో సంచలన కథనం ప్రచురితమైంది.
We’re now on WhatsApp. Click to Join.
సెప్టెంబరులో ఢిల్లీ వేదికగా జరిగిన జీ20 సదస్సుకు హాజరైన అమెరికా అధ్యక్షుడు బైడెన్.. ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా గురుపత్వంత్ హత్యకు కుట్ర అంశాన్ని కూడా లేవనెత్తారని వాషింగ్టన్ పోస్టు కథనం పేర్కొంది. నవంబర్‌లో అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్, రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ భారత పర్యటన సందర్భంగానూ ఈ అంశం చర్చకు వచ్చింది. పన్నూ హత్యకు కుట్ర పన్నాడని భారతీయ అధికారిపై అమెరికా అభియోగాలను మోపడం ఆందోళన కలిగించే విషయమని భారత విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింది. ఈ అంశంపై విచారణకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని అనౌన్స్(CIA Chief – India) చేసింది.