Delhi Elections : రాజధానిలో బాబు ప్రచారం..బిజెపి నయా ప్లాన్
Delhi Elections : ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) ఢిల్లీ లో బిజెపి నేతల తరుపున ప్రచారం చేయబోతున్నారు
- By Sudheer Published Date - 11:02 AM, Wed - 29 January 25

దేశ రాజధాని ఢిల్లీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల (Delhi Elections) వేడి రోజు రోజుకు కాకరేపుతుంది. అధికార , ప్రతిపక్ష పార్టీలు గెలుపే లక్ష్యంగా తమ మ్యానిఫెస్టో లను విడుదల చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) ఢిల్లీ లో బిజెపి నేతల తరుపున ప్రచారం చేయబోతున్నారు.
Indian News Paper Day : జనవరి 29ని ఇండియన్ న్యూస్ పేపర్ డేగా ఎందుకు జరుపుకుంటారు..?
2024 సార్వత్రిక ఎన్నికలలో ఇటు ఏపీతో అటు కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేంద్రంలోని మోదీ సర్కార్ ఏర్పాటులో కూడా కూటమి తరఫున గెలుపొందిన ఎంపీలు కీలక పాత్ర వహించారు. ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొని మహాయుతి కూటమి గెలుపులో కీలకమైయ్యారు. ఈ నేపథ్యంలోనే అదే ఊపుతో ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనాలని సీఎం చంద్రబాబుకు బీజేపీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చంద్రబాబు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. చంద్రబాబు దేశంలోనే అత్యంత అనుభవజ్ఞుడైన రాజకీయ నేత కావడంతో, ఆయన సేవలను వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పాలనకు వ్యతిరేకంగా బీజేపీ మద్దతును పెంచేందుకు చంద్రబాబు ప్రచారం చేయనున్నారు.
బీజేపీ ప్రధానంగా ఆప్ ప్రభుత్వాన్ని ఢిల్లీలో ఓడించాలనే లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రచారం మరింత ప్రభావశీలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన తెలుగు ప్రజలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ తరఫున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేస్తారని వార్తలైతే బయటకు వస్తున్నాయి కానీ ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ప్రధానంగా ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు జరగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు లేదని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో పోటీ మరింత ఉత్కంఠగా మారింది.