Corona in China: మళ్ళీ కరోనా టెర్రర్.. చైనాలో లాక్‌డౌన్..!
- By HashtagU Desk Published Date - 11:53 AM, Sat - 12 March 22

కరోనా మహమ్మారికి పుట్టినిల్లు అయిన చైనాను ఆ మహమ్మారి వీడడం లేదు. గత రెండేళ్లుగా ప్రపంచమంతా చుట్టి వస్తున్నా.. చైనాను మాత్రం వదిలిపెట్టడం లేదు. అందుకే కొన్ని రోజులుగా అక్కడ మళ్లీ అది తన ప్రతాపం చూపిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే దాదాపు 1300 కేసులు రిజిస్టరయ్యాయి. పైగా రోజువారీ కేసుల సంఖ్య 1000 దాటిపోతుండడంతో దెబ్బకు లాక్ డౌన్ విధించాల్సి వచ్చింది.
చైనాలో గత రెండేళ్లలో రోజువారీ కేసులు వెయ్యికి పైగా ఉండడం ఇదే తొలిసారి. ఎందుకంటే మూడు వారాల కిందట పరిస్థితి చూస్తే.. రోజువారీ కేసులు 100 కన్నా తక్కువే ఉండేవి. కానీ ఇప్పుడు వేగంగా పెరుగుతున్నాయి. చైనాలో దాదాపు 12 ప్రావిన్సుల్లో కరోనా చాలా వేగంగా వ్యాపిస్తోంది. దీంతో ఆ దేశం కఠిన చర్యలను తీసుకుంటోంది. అందుకే ఈశాన్యంలో ఉండే చాంగ్ చున్ సిటీలో లాక్ డౌన్ ను విధించింది.
చాంగ్ చున్ సిటీలో వైరస్ విజృంభణ ఎక్కువగా ఉండడంతో చైనాలో టెన్షన్ పెరుగుతోంది. ఈ సిటీలో దాదాపు 90 లక్షల జనాభా ఉంది. చైనాలో ఇప్పుడు జీరో కొవిడ్ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అంటే.. ఒక్క కేసు నమోదైనా సరే.. లక్షల కొద్దీ పరీక్షలు చేస్తారు. అలాంటిది రోజువారీగా వెయ్యికన్నా ఎక్కువ కేసులు వస్తుంటే ఇక ఆగుతుందా? టెస్టుల సంఖ్యను భారీగా పెంచేసింది.
లాక్ డౌన్ సమయంలో ఎక్కడివారు అక్కడే అన్న పాలసీని ఫాలో అవుతోంది. షాంఘైతో పాటు ఇతర నగరాల్లోనూ పెద్ద ఎత్తున కొవిడ్ పరీక్షలు చేయడానికి ఏర్పాట్లు చేసింది. షాంఘైలో అయితే కొన్నిప్రాంతాల్లో స్కూళ్లకు తాళాలు వేసి.. అందులో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులను అక్కడే ఉంచేశారు. వారికి పరీక్షలు పూర్తయ్యేవరకు బయటకు వెళ్లనివ్వరని టాక్.
రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్.. ఇలా బయటి ప్రదేశాల్లో ఉన్నవారిని అక్కడే ఉంచి వారికి టెస్టులు చేస్తున్నారు. రిజల్ట్ వచ్చేవరకు వారిని కదలనివ్వడం లేదు. రెండేళ్లుగా ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా బూచి.. ఇంకా చైనా వెన్నులో వణుకు పుట్టిస్తోంది.