Bomb Threats : స్నేహితుడి కోసం విమానంలో బాంబ్ అంటూ బెదిరింపు..మైనర్ అరెస్ట్
ఇలా వరుస బాంబ్ బెదిరింపు కాల్స్ నేపథ్యంలో విచారణ జరిపిన ముంబై పోలీసులు ఛత్తీస్ ఘడ్ కు చెందిన ఓ మైనర్ (17)ను అదుపులోకి తీసుకున్నారు
- By Sudheer Published Date - 11:07 AM, Thu - 17 October 24

కొద్ది రోజులుగా విమానాలకు (Air planes, ) వస్తున్న బాంబు బెదిరింపులు (Bomb Threats) కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఫేక్ కాల్స్ అధికారులను చెమటలు పట్టిస్తున్నాయి. అంతే కాదు ప్రయాణికులు సైతం విమాన ప్రయాణం అంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఇలా వరుస బాంబ్ బెదిరింపు కాల్స్ నేపథ్యంలో విచారణ జరిపిన ముంబై పోలీసులు ఛత్తీస్ ఘడ్ కు చెందిన ఓ మైనర్ (17)ను అదుపులోకి తీసుకున్నారు.
ముంబై నుంచి బయల్దేరిన విమానాలకు భద్రతా ముప్పు ఉందంటూ పోస్టు పెట్టిన ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టి..ఆ పోస్ట్ ఎక్కడి నుండి వచ్చిందో కనుగొనే ప్రయత్నం చేయగా.. ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఓ వ్యాపారవేత్త కుమారుడు (17) సోషల్ మీడియాలో ఈ బెదిరింపు పోస్టులు పెట్టినట్లు గుర్తించారు. ఈ కేసులో సదరు వ్యాపారవేత్తకు సమన్లు పంపిన పోలీసులు.. నిందితుడైన మైనర్ ను అదుపులోకి తీసుకుని ముంబై తరలించారు.
నగదు విషయంలో గొడవపడిన ఓ స్నేహితుడిని ఇరికించేందుకు ఈ బాలుడు ఇదంతా చేసినట్లు తెలిసింది. తన స్నేహితుడి పేరుతో ఎక్స్ ఖాతా ఓపెన్ చేసి.. ఆ అకౌంట్ నుంచి విమానాలకు బాంబు బెదిరింపు పోస్టులు పెట్టాడు. ఇలాగే మూడు విమానాలకు బాంబు బెదిరింపు సందేశాలు పోస్టు చేశాడు. ఎయిర్ లైన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి.. ఆ పోస్టుల వెనుక ఉన్న నిందితుడిని పట్టుకున్నారు. ఈ మేరకు బాలుడి తల్లిదండ్రులకు నోటీసులు ఇచ్చి.. బాలుడిని అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకి తరలించారు. మిగిలిన విమానాలకు వచ్చిన బాంబు బెదిరింపు కాల్స్, మెసేజ్ లకు ఈ బాలుడికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు.
Read Also : Spirit : ప్రభాస్ మూవీ లో రణబీర్, విజయ్ దేవరకొండ..?