Eknath Shinde : ‘మహా’ సస్పెన్స్.. సాయంత్రంకల్లా ఏక్‌నాథ్ షిండే కీలక నిర్ణయం
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ తర్వాత ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) సానుకూలంగానే స్పందించారు.
- By Pasha Published Date - 11:24 AM, Sat - 30 November 24

Eknath Shinde : ఈసారి మహారాష్ట్ర సీఎం అయ్యే అవకాశాన్ని కోల్పోయిన శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే ఈరోజు సాయంత్రంకల్లా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తన భవిష్యత్తు కార్యాచరణను ఆయన ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ఆయన మహాయుతి కూటమిలోనే ఉంటారా ? లేదా ? అనే దానిపై సందేహాలు రేకెత్తుతున్నాయి. తాజాగా మహాయుతి కూటమి ముఖ్యనేతల సమావేశానికి షిండే గైర్హాజరయ్యారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో శివసేన నేత సంజయ్ శిర్సాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కొత్త ప్రభుత్వంలో షిండేను పక్కన పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని ఆయన ఆరోపించారు. ‘‘మాతో పొత్తు వల్ల మహాయుతి కూటమికి, బీజేపీకి ప్రయోజనం చేకూరింది. కొన్ని పథకాలకు ఎన్‌సీపీ అభ్యంతరం చెప్పినా షిండే అమలు చేశారు. ఆ పథకాలన్నీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి కలిసొచ్చాయి. ప్రజలు ఓట్లు వేశారు. సీఎం పదవిని బీజేపీ తీసుకుంటే.. హోంశాఖను డిప్యూటీ సీఎంగా ఏక్‌నాథ్ షిండేకు ఇవ్వాలి. హోంశాఖను సీఎం వద్దే ఉంచుకుంటామని వాదించడం సరికాదు. శివసేనకు కీలక శాఖలు దక్కకుండా కుట్రలు చేస్తున్నారు’’ అని సంజయ్ శిర్సాట్ వ్యాఖ్యానించారు.
Also Read :KTR Break : రాజకీయాలకు బ్రేక్.. కేటీఆర్ సంచలన ట్వీట్
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ తర్వాత ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) సానుకూలంగానే స్పందించారు. సీఎం ఎంపికపై సహకరిస్తానని చెప్పారు. అయితే కొన్ని గంటల్లోనే మళ్లీ షిండే యూటర్న్ తీసుకున్నారు. మహాయుతి కూటమి ముఖ్య నేతల సమావేశాన్ని రద్దు చేసుకొని.. తన సొంతూరికి వెళ్లిపోయారు. దీంతో సీఎం ఎంపిక, రాష్ట్రంలోని మంత్రిత్వ శాఖల కేటాయింపుపై షిండే గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆరోగ్య సమస్యల వల్లే షిండే సొంతూరికి వెళ్లారని శివసేన నేతలు చెబుతున్నారు. మరోవైపు బీజేపీ సీఎం ముఖంగా దేవేంద్ర ఫడ్నవిస్ పేరే ఎక్కువగా ప్రచారంలో ఉంది. అయితే ప్రస్తుతం కేంద్ర సహాయమంత్రిగా ఉన్న బీజేపీ ఎంపీ మురళీధర్ మోహోల్‌ను సీఎం చేసే అవకాశాలు ఉన్నాయనే టాక్ కూడా తెరపైకి వచ్చింది. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేని పరిస్థితి ఏర్పడింది.