BJP : బిజెపి సోషల్ ఇంజనీరింగ్
- By Sudheer Published Date - 12:00 AM, Mon - 18 December 23

డా. ప్రసాదమూర్తి
అటు పక్క నుంచి నరుక్కు రమ్మన్నారు పెద్దలు. ఈ సూత్రాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఇప్పుడు తమ రాజకీయ ప్రయోజనాల సాధనలో ప్రముఖంగా పాటిస్తున్నట్టు అర్థమవుతోంది. బిజెపి విజయం సాధించిన మూడు రాష్ట్రాలు- మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లలో ముఖ్యమంత్రుల ఎంపిక, వారి డిప్యూటీల ఎంపిక చూస్తే ఇది మనకు మరింత స్పష్టంగా బోధపడుతుంది. బిజెపి తన హార్డ్ కోర్ హిందుత్వ సిద్ధాంతాన్ని ఎట్లాగూ మెయిన్ ఎజెండాగా ముందుకు తీసుకు వెళుతుంది. కానీ ఇటీవల కాంగ్రెస్ పార్టీతో సహా మిగిలిన ప్రతిపక్షాలన్నీ ఓబిసి కార్డు, దళిత కార్డు, ముస్లిం కార్డు మొదలైన సోషల్ ఇంజనీరింగ్ కార్డులు అన్నీ బయటకు తీసి ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో, కేవలం హిందుత్వను పట్టుకు కూర్చుంటే ఏమో, ఎక్కడైనా దెబ్బతినే అవకాశం ఉందని బిజెపి నాయకులు గమనించి ఉంటారు. అందుకే ఆపద్ధర్మంగా అటు హిందుత్వతో పాటు, ఇటు సోషల్ ఇంజనీరింగ్ ని కూడా జత చేస్తే సరిపోతుందని గట్టిగా నమ్మి ఉంటారు.
పైన పేర్కొన్న మూడు రాష్ట్రాల్లోనూ బిజెపి మూడు సామాజిక వర్గాల నుంచి ముగ్గురు ముఖ్యమంత్రులను ఎంపిక చేసింది బిజెపి. చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయి పాలక పగ్గాలు చేపట్టారు. ఆయన సాహు సామాజిక వర్గానికి చెందిన గిరిజన నాయకుడు. బిజెపిలో ఆదివాసి వర్గానికి సంబంధించి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. విష్ణుదేవ్ 2020-22 మధ్య పార్టీ ఛత్తీస్ గఢ్ ప్రదేశ్ అధ్యక్షుడిగా పనిచేశారు. చత్తీస్గఢ్లో గిరిజన వోటర్లే కీలకం. ఆయన గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన అనుభవజ్ఞుడు. ఛత్తీస్ గఢ్ లో మతమార్పిడి విషయంలో బిజెపి చాలాకాలంగా హిందుత్వ ప్రచారాన్ని ముందుకు తీసుకు వెళుతూ ఉంది. ఈ విషయంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తుందని బిజెపి నాయకులు చేసిన ప్రచారం గిరిజనుల్లో బాగా నాటుకుంది. ఆదివాసి సముదాయాల్లో మంచి పలుకుబడి ఉన్న నాయకుడిగా విష్ణుదేవ్ సాయి ఎదిగి రావడం బీజేపీకి అంది వచ్చినట్టయింది. ఆయన్ని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా పుణ్యమూ పురుషార్థమూ రెండు దక్కినట్టు అయింది బిజెపికి.
ఇక మధ్యప్రదేశ్లో ఒక బీసీ వ్యక్తిని బిజెపి అగ్రనాయకత్వం ముఖ్యమంత్రిని చేసింది. మోహన్ యాదవ్ కలలో కూడా తన పేరు ప్రస్తావనకు వస్తుందని ఊహించలేదట. ఆయన కూడా యథావిధిగా హిందుత్వ హార్డ్ కోర్ కార్యకర్తే. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ తో సహా అనేకమంది దిగ్గజాలు ముఖ్యమంత్రి పదవికి పోటీపడిన నేపథ్యంలో వాళ్లందరినీ పక్కకు తోసి మోహన్ యాదవ్ ఆ పదవిని అలంకరించడం చాలామందికి ఆశ్చర్యం కలిగించిన మాట వాస్తవం. కానీ బిజెపి మదిలో సోషల్ ఇంజనీరింగ్ కీలకంగా పనిచేస్తుందని ఈ ఎంపిక ద్వారా మనకు తెలుస్తోంది. ప్రధాని మోడీకి పరమ భక్తుడు, విధేయుడైన మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టగానే తనలోని హిందుత్వ భక్తున్ని బయటకు తీసి వెంటనే కొన్ని చర్యలు చేపట్టారు. మసీదుల్లో లౌడ్ స్పీకర్లను నియంత్రించడం, బహిరంగ మాంసపు దుకాణాలను నిషేధించడం, భోపాల్, ఉజ్జయిని, గ్వాలియర్ నగరాల్లో బుల్డోజర్లు పెట్టి మీట్ షాపుల్ని నేలమట్టం చేయడం లాంటి నిర్ణయాలతో ఆయన తనలోని కాషాయ వీరున్ని ప్రపంచానికి పరిచయం చేసుకున్నాడు. మోహన్ యాదవ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాదు చౌహాన్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. బిజెపి తాజా రాజకీయాల నేపథ్యంలో భాగంగానే ఓబీసీ ముఖ్యమంత్రిగా ఆయన తెరమీదకు రావడం జరిగిందని చెప్పుకోవాలి.
ఇక రాజస్థాన్లో ఒక బ్రాహ్మణ నాయకుడు ముఖ్యమంత్రి పగ్గాలను చేపట్టారు. ఆయనే భజన్ లాల్ శర్మ. ఈయన ఎంపిక మరింత ఆశ్చర్యం. భజన్ లాల్ తొలిసారి ఇప్పుడే ఎమ్మెల్యేగా గెలిచారు.రాజస్థాన్లో ఒక బ్రాహ్మణ నాయకుడు ముఖ్యమంత్రి కావడం గత 30 సంవత్సరాలలో ఇది రెండోసారి. తమ సోషల్ ఇంజనీరింగ్ రాజకీయ పరంపరలో అగ్రవర్ణాల మనోభావాలు ఎక్కడ దెబ్బతింటాయో అని బిజెపి గ్రహించి, రాజస్థాన్లో ఆ లోపాన్ని పూడ్చుకోవడానికి భజన్ లాల్ ని ముఖ్యమంత్రిని చేసి ఉంటుంది. అయితే అక్కడ ఒక దళిత వ్యక్తిని, ఒక రాజ్ పుట్ వ్యక్తిని డిప్యూటీ ముఖ్యమంత్రులుగా నియమించడం కూడా బిజెపి తాజా సోషల్ ఇంజనీరింగ్ విధానంలో భాగంగానే చూడాలి.
ఇదంతా బిజెపి ఇటీవల అనుసరిస్తున్న సామాజిక న్యాయ సూత్ర విధానంలో ఒక భాగం. అయితే ఎంపికైన వివిధ సామాజిక వర్గాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అందరూ దశాబ్దాలుగా పార్టీలో పని చేస్తున్న కార్యకర్తలే. కింది స్థాయి నుంచి నాయకులుగా ఎదిగి వచ్చిన వారే. తమ పార్టీ హిందుత్వ ఎజెండాను అమలు చేయడంలో ముందు నడిచిన వారే. అందుకే పార్టీ వారికి ఈ అగ్ర పీఠాలను బహుమానంగా ప్రసాదించింది. మొత్తానికి బిజెపి అటు హిందుత్వ ఎజెండాతో పాటు సామాజిక న్యాయ జెండాను కూడా రెండు చేతులతో పట్టుకొని ముందుకు నడుస్తోంది. మరి బిజెపి ఈ తాజా అవతారాన్ని విపక్షాలు ఎలా ఢీకొని నిలుస్తాయో చూడాలి.
Read Also : Irrigation Projects : జల ప్రాజెక్టుల చిట్టా తీయండి.. ఇరిగేషన్ అధికారులకు సీఎం ఆర్డర్