Budget 2025 : సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..
ప్రస్తుతం వడ్డీ ఆదాయంపై సీనియర్ సిటిజన్లకు రూ.50 వేల వరకు మినహాయింపు కల్పిస్తుండగా దానిని రెండింతలు చేశారు. అంటే రూ. 50 వేల నుంచి రూ.1 లక్షకు వడ్డీపై ఆదాయంపై పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు చెప్పారు.
- By Latha Suma Published Date - 01:12 PM, Sat - 1 February 25

Budget 2025 : 2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌ను ఎన్డీయే సర్కార్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈక్రమంలోనే కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలోని 60 ఏళ్ల వయసు పైబడిన సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట కల్పించారు. వివిధ పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయంపై ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (TDS) పరిమితిని పెంచుతూ ఊరట ఇచ్చారు. ప్రస్తుతం వడ్డీ ఆదాయంపై సీనియర్ సిటిజన్లకు రూ.50 వేల వరకు మినహాయింపు కల్పిస్తుండగా దానిని రెండింతలు చేశారు. అంటే రూ. 50 వేల నుంచి రూ.1 లక్షకు వడ్డీపై ఆదాయంపై పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు చెప్పారు.
ఈసారి బడ్జెట్లో 60 సంవత్సరాలు పైబడిన వారికి ఊరట కల్పిస్తారనే ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే ఊరట కల్పించారు. రూ.1 లక్ష వరకు వడ్డీ ఆదాయంపై మినహాయింపు కల్పించారు. అలాగే అద్దె ఆదాయంపై రూ.6 లక్షల వరకు మినహాయింపు ఇచ్చారు. దీంతో లక్షల మందికి ఊరట లభిస్తుందని చెప్పవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో చేసే పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు పరిమితి రెండింతలైంది. ఇక నుంచి పాత పన్ను విధానంలో రూ.1 లక్ష వరకు పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు. మరోవైపు అద్దె ద్వారా వచ్చే ఆదాయంపైనా ఊరట ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కల్పించారు. ప్రస్తుతం అద్దె ఆదాయం రూ.2.40 లక్షల వరకు టీడీఎస్ మినహాయింపు ఉండేది. దానిని ఏకంగా రూ.6 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో వెల్లడించారు.
ఇక, జల్ జీవన్ మిషన్‌ను ప్రభుత్వం 2028 వరకు పొడిగించబోతోందని నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రతి ఇంటికి కుళాయి నీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. కాగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన బడ్జెట్ ప్రసంగం.. మధ్యాహ్నం 12.15 గంటల వరకు కొనసాగింది. అనంతరం లోక్‌సభను సోమవారానికి వాయిదా వేశారు.
Read Also: Budget 2025: బడ్జెట్ 2025.. రియల్ ఎస్టేట్, స్టార్టప్ కంపెనీల వృద్ధికి కీలక ప్రకటన!