Babyrani Maurya: గవర్నర్ పదవికి రాజీనామా చేసి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు.. ఎవరీ బేబీ రాణి మౌర్యా?
- By hashtagu Published Date - 02:23 PM, Sun - 13 March 22
గవర్నర్ గా చేసినవాళ్లు రాష్ట్రపతి అవ్వాలనుకుంటారు కాని తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటారా? కానీ బేబీ రాణి మౌర్యా రూటే వేరు. ఆల్రెడీ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి గవర్నర్ గా చేశారు. ఇక ఆ పదవీకాలం ముగిసిన తరువాత రిటైర్ అయిపోతారులే అనుకున్నారు. కానీ అలా భావించిన వాళ్లందరికీ ఒక్కసారిగా షాకిచ్చారు. సీన్ కట్ చేస్తే.. యూపీలో ఎమ్మెల్యేగా గెలిచారు.
మొదటి నుంచి బీజేపీ నాయకురాలిగా ఉన్న బేబీ రాణి మౌర్య.. 2018 ఆగస్టు 26న ఉత్తరాఖండ్ ఏడో గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు. కానీ 2021 సెప్టెంబర్ లో ఆ పదవికి రాజీనామా చేశారు. అది కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు రిజైన్ చేసి.. బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో అందరూ ఒక్కసారిగా విస్తుపోయారు.
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా రూరల్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేయడానికి ఆమె సిద్ధపడ్డప్పుడు అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. గవర్నర్ గా చేసినోళ్లు మళ్లీ ఎమ్మెల్యేగా పోటీచేయడమేంటి అని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే డాక్టర్ కోర్స్ చేసినవాళ్లు.. మళ్లీ స్కూల్లో చదువుకుంటాను అన్నట్టుంది అంటూ పొలిటికల్ సెటైర్లు పేల్చారు.
బేబీ రాణి మౌర్య.. ఏదో ఆషామాషీగా పోటీ చేసిన ఊరుకోలేదు. క్యాంపైన్ గట్టిగా చేయడంతో దాదాపుగా లక్షా 36 వేల ఓట్లను సాధించారు. ప్రత్యర్థిగా పోటీ చేసిన బీఎస్పీ అభ్యర్థి కిరణ్ ప్రభ కేసరిపై సుమారుగా 76 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మౌర్యాకు 1996లోనే ఆగ్రాకు మేయర్ గా చేసిన అనుభవం ఉంది. తరువాత బీజేపీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఓడిపోయారు.
బేబీ రాణి మౌర్యాను బీజేపీ బలమైన దళిత నాయకురాలిగా భావిస్తోంది. అందుకే ఆమె విజయానికి అన్ని రకాలుగా సహకరించింది. పైగా బీఎస్పీ అధినేత్రి మాయావతి రాజకీయంగా పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు. అందుకే ఆ పార్టీకి బలంగా ఉండే జాదవ్ ఓట్లన్నీ బీజేపీకి పడ్డాయి. దీనికి మోదీ-యోగీ ఫ్యాక్టర్ కూడా తోడైంది. అందుకే మౌర్యా విజయం ఈజీ అయ్యింది.
బేబీ రాణి మౌర్యాకు రాష్ట్ర క్యాబినెట్ లో మంత్రిగా అవకాశం ఇవ్వచ్చు. అదృష్టం బాగుంటే.. ఆమెకు డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వచ్చని ప్రచారం నడుస్తోంది. మొత్తానికి రివర్స్ లో నడుస్తున్న ఆమె రాజకీయ ప్రయాణం ఇంకా ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.