Baba Siddique Murder Case : వెలుగులోకి సంచలన విషయాలు
Baba Siddique Murder Case : లారెన్స్ బిష్నోయి గ్యాంగ్ ని అతని ముగ్గురు అనుచరులు అన్మోల్ బిష్నోయి (సోదరుడు), గోల్డీ బ్రార్, రోహిత్ గోదార్ నడుపుతున్నారు
- By Sudheer Published Date - 02:30 PM, Mon - 14 October 24

బాబా సిద్ధిఖీ హత్య (Baba Siddique Murder) కేసు ఎంతటి సంచలనం సృష్టిస్తుందో తెలియంది కాదు. ఈ కేస్ లో లారెన్స్ బిష్ణోయ్..గ్యాంగ్ పేరు వెలుగులోకి వచ్చిన సంగతి కూడా తెలిసిందే. బాబా సిద్దిఖ్ హత్యకు ప్రధాన కారణం.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తో ఆయన స్నేహమే అని ప్రచారం జరుగుతోంది. కానీ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్నోయి ప్రస్తుతం గుజరాత్ లోని సాబర్ మతి జైల్లో ఉన్నాడు. డజన్ల కొద్దీ మర్డర్ కేసులు, కిడ్నాప్ కేసుల్లో అతడిపై విచారణ జరుగుతోంది. జైల్లో ఉన్నా ఈ కుర్ర మాఫియా డాన్ అనుకన్నది కనుసైగలతో సాధిస్తున్నాడు.
లారెన్స్ బిష్నోయి గ్యాంగ్ ని అతని ముగ్గురు అనుచరులు అన్మోల్ బిష్నోయి (సోదరుడు), గోల్డీ బ్రార్, రోహిత్ గోదార్ నడుపుతున్నారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్నోయి జైల్లో ఉంటూనే వేగంగా తన నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడని ఎన్ఐఏ తన రిపోర్ట్ లో తెలిపింది. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్నోయి కి.. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంలా పవర్ ఫుల్ గ్యాంగ్ ఉందని ఈ రిపోర్ట్ లో పేర్కొంది.
బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్ (Hit List)లో సిద్ధిఖీ తనయుడు, ఎమ్మెల్యే జీశాన్ సిద్ధిఖీ (Zeeshan Siddique) కూడా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు బాబా సిద్ధిఖీపై కాల్పులు జరిపిన షూటర్లు (Shooters) విచారణ సందర్భంగా పోలీసులకు తెలిపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తండ్రీ కొడుకుల్ని చంపేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ (Bishnoi gang) వద్ద కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు షూటర్లు చెప్పినట్లు సదరు వర్గాలు తెలిపాయి. హత్య జరిగిన ప్రదేశంలో తండ్రీ కొడుకులిద్దరూ ఉంటారని.. ఒకేసారి పని అయిపోతుందని షూటర్లు భావించారు. ఒకవేళ ఇద్దరిపై కాల్పులు జరిపే అవకాశం రాకపోతే.. ముందుగా ఎవరు కనిపిస్తే వారిని హతమార్చాల్సిందిగా బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి షూటర్లకు ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.
ఇక 2022లోనే సల్మాన్ ఖాన్ (Salman Khan) ని హత్య చేసేందుకు సంపత్ నెహ్రా అనే గ్యాంగ్ స్టర్ ని లారెన్స్ బిష్నోయి పంపించాడని కానీ ఆ సమయంలో ప్లాన్ విఫలమైందని తెలిసింది. ఆ తరువాత 2023లో సల్మాన్ ఖాన్ మేనేజర్ కు లారెన్స్ బిష్నోయి ఒక ఈమెయిల్ పంపించాడు. తన సామాజిక వర్గానికి సల్మాన్ ఖాన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని లేకపోతే అతని చంపుతానని ఈ-మెయిల్ పంపించాడు. ఆ ఈ మెయిల్ ని సల్మాన్ మేనేజర్ ఆ సమయంలో మీడియాకు చూపించాడు. 2024 ఏప్రిల్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపింది. తమ ఆరాధ్య జంతువు కృష్ణ జింకను సల్మాన్ చంపడంతో వారు దాడి చేశారు. సిద్ధిఖీ హత్యతో సల్మాన్ ఇంటి వద్ద మరోసారి భారీగా భద్రత పెంచారు.
Read Also : China Vs India : బార్డర్‌లో బరితెగింపు.. పాంగోంగ్ సరస్సు సమీపంలో చైనా నిర్మాణ పనులు