Bibhav Kumar Arrest : స్వాతి మలివాల్‌పై దాడి.. కేజ్రీవాల్ మాజీ పీఎస్ బిభవ్ అరెస్ట్
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడికి పాల్పడిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాజీ పర్సనల్ సెక్రెటరీ (పీఎస్) బిభవ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
- By Pasha Published Date - 01:39 PM, Sat - 18 May 24

Bibhav Kumar Arrest : ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడికి పాల్పడిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాజీ పర్సనల్ సెక్రెటరీ (పీఎస్) బిభవ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం మధ్యాహ్నం సీఎం నివాసంలోకి వెళ్లిన పోలీసులు బిభవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఆయనను సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈనెల 13న కేజ్రీవాల్ నివాసానికి స్వాతి మలివాల్ వెళ్లగా.. ఆమెపై బిభవ్ కుమార్ దాడి చేశాడు. దీనిపై ఆమె ఈనెల 16న పోలీసులకు ఫిర్యాదు చేయగా బిభవ్‌పై కేసు నమోదైంది. అనంతరం మలివాల్‌కు ఎయిమ్స్‌లో ఢిల్లీ పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. మలివాల్ కండ్లు, కాళ్ళపై దెబ్బలు ఉన్నాయంటూ తాజాగా వైద్య నివేదిక వచ్చింది. దీంతో ఇవాళ పోలీసులు రంగంలోకి దిగి బిభవ్‌ను అరెస్టు చేశారు. మరోవైపు స్వాతి మలివాల్‌పై జరిగిన దాడికి సంబంధించిన మరో వీడియో తాజాగా శనివారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో సీఎం ఇంటి వద్ద ఉన్న సిబ్బందికి, మలివాల్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న సీన్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join
మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ తమ పార్టీకే చెందిన ఎంపీ స్వాతి మలివాల్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టింది. బీజేపీ సూచనల మేరకే ఈవిషయంపై స్వాతి రాద్ధాంతం, రాజకీయం చేస్తున్నారని ఆరోపించింది. బిభవ్ కుమార్‌పై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆప్ వాదిస్తోంది. జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలోనూ.. బిభవ్ కుమార్‌నే కేజ్రీవాల్ సమర్ధిస్తున్నారని తెలిపారు.
Also Read : Mallareddy Vs 15 People : ‘మా భూమినే కబ్జా చేస్తారా?’ అంటూ ఊగిపోయిన మల్లారెడ్డి
స్వాతి మలివాల్‌పై దాడి ఘటన నిరాధారమైందని ఢిల్లీ మంత్రి అతిషి ఇటీవల అన్నారు. అపాయింట్‌మెంట్ లేకుండానే సీఎం నివాసానికి స్వాతి మలివాల్ వచ్చారని తెలిపారు. కేజ్రీవాల్‌ను కలవాల్సి ఉందని స్వాతి పట్టుబట్టగా, ఆయన బిజీగా ఉన్నారని బిభవ్ కుమార్ చెప్పారన్నారు అతిషి. స్వాతి మలివాల్ అరుస్తూ లోపలికి వెళ్లేందుకు యత్నించారని.. బిభవ్ కుమార్‌పై బెదిరింపులకు దిగినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని అతిషి చెప్పారు. తనను దారుణంగా కొట్టారని స్వాతి ఆరోపిస్తుంటే.. వీడియోలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉందన్నారు. దీనిపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్న అనుమానాలు రాజకీయంగా తీవ్ర ఆసక్తిని రేపుతున్నాయి.