Arvind Kejriwal Vs ED : మూడోసారీ ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా.. ఆప్ వాదన ఇదీ
Arvind Kejriwal Vs ED : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇవాళ కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరుకారని ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది.
- By Pasha Published Date - 10:08 AM, Wed - 3 January 24

Arvind Kejriwal Vs ED : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇవాళ కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరుకారని ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది. ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధమని, కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడమే దాని ఏకైక లక్ష్యంగా మారిందని ఆప్ ఆరోపించింది. ఈడీ దర్యాప్తునకు సహకరించేందుకు కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నా సమన్లు పదేపదే పంపడం సరికాదని పేర్కొంది. ‘‘గతంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు ఎందుకు పంపింది ? ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా ఆయనను అడ్డుకోవడానికే ఆనాడు నోటీసులు పంపారనే విషయం క్లియర్‌గా అర్ధమైపోతోంది’’ అని ఆప్(Arvind Kejriwal Vs ED) తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇంతకుముందు నవంబరు 2, డిసెంబర్ 21 తేదీల్లో ఢిల్లీ సీఎంకు ఈడీ సమన్లు జారీ చేసింది. దీంతో జనవరి 3న విచారణకు హాజరుకావాలంటూ మూడో నోటీసును పంపింది. ఇప్పుడు దానికి కూడా స్పందించకూడదని కేజ్రీవాల్ డిసైడ్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఆప్ చీఫ్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) ఏప్రిల్‌లో ప్రశ్నించింది. అయితే నిందితుల జాబితాలో కేజ్రీవాల్ పేరును చేర్చలేదు. అనంతరం ఈడీ సమన్లు జారీ చేసినప్పటి నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రిని ప్రశ్నించిన తర్వాత అరెస్టు చేస్తారనే ప్రచారం మొదలైంది. సాక్షాత్తూ ఆప్ పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా ఇదే తరహాలో బహిరంగ ప్రకటనలు చేశారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఫిబ్రవరిలో అరెస్టు చేయగా, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ను అక్టోబర్‌లో అదుపులోకి తీసుకున్నారు.