Pawars Reunion : ఏకం కానున్న ఇద్దరు పవార్లు ? అజిత్ పవార్ తల్లి కీలక వ్యాఖ్యలు
తల్లి మాట ప్రకారం అజిత్ పవార్(Pawars Reunion) మనసు మార్చుకుంటారా ? శరద్ పవార్‌తో చేతులు కలుపుతారా ? అనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.
- By Pasha Published Date - 01:40 PM, Thu - 2 January 25

Pawars Reunion : మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త ట్విస్ట్ త్వరలోనే సాక్షాత్కారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అజిత్ పవార్ తల్లి ఆశా తాయి చేసిన వ్యాఖ్యలు కొత్త ఊహాగానాలకు తెరతీశాయి. సోలాపూర్ జిల్లా పండర్‌పూర్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.“పవార్ కుటుంబంలో ఏర్పడిన వైరుధ్యాలన్నీ తొలగిపోవాలని నేను దేవుడిని ప్రార్థించాను. అజిత్, శరద్ పవార్ మళ్లీ కలిసిపోవాలని దేవుణ్ని కోరుకున్నాను. నా ప్రార్థనలు ఫలిస్తాయని ఆశిస్తున్నాను’’ అని ఆశాతాయి పేర్కొన్నారు. ఇద్దరు పవార్‌లను మళ్లీ కలిపేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారనే విషయం ఈ వ్యాఖ్యలతో స్పష్టమైపోయింది. తల్లి మాట ప్రకారం అజిత్ పవార్(Pawars Reunion) మనసు మార్చుకుంటారా ? శరద్ పవార్‌తో చేతులు కలుపుతారా ? అనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.
Also Read :Bhopal Gas Tragedy : భోపాల్ గ్యాస్ దుర్ఘటన వ్యర్థాలు.. 40 ఏళ్ల తర్వాత ఏం చేశారంటే.. ?
డిసెంబరు 12న శరద్ పవార్ పుట్టినరోజు.. ఆ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేందుకు ఢిల్లీలోని శరద్ పవార్ నివాసానికి అజిత్ పవార్ స్వయంగా వెళ్లారు. ఇటీవలే శరద్ పవార్ గురించి అజిత్ పవార్ వర్గం నేత, మాజీ కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ తన మనసులోని మాటలు బయటపెట్టారు. ‘‘శరద్ పవార్ ఎప్పుడూ మాకు తండ్రిలాంటివారు. మేం భిన్నమైన రాజకీయ వైఖరిని తీసుకున్నప్పటికీ.. ఎల్లప్పుడూ శరద్ పవార్‌ను గౌరవిస్తాం. పవార్ కుటుంబం తిరిగి కలిస్తే, మేం చాలా సంతోషిస్తాం. నేను పవార్ కుటుంబంలో ఒక భాగమని భావిస్తున్నాను’’ అని ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యానించారు. అజిత్ పవార్ వర్గానికి చెందిన మరో నేత, మహారాష్ట్ర మంత్రి నరహరి జిర్వాల్ మాట్లాడుతూ.. ‘‘ఎన్‌సీపీలో చీలిక నన్ను చాలా బాధపెట్టింది. శరద్ పవార్, అజిత్ పవార్ కలిస్తే కార్యకర్తలకు ప్రయోజనం చేకూరుతుంది. శరద్ పవార్‌ను మేం చాలా గౌరవిస్తాం’’ అని పేర్కొన్నారు. మొత్తం మీద అజిత్ పవార్ వర్గం నుంచి శరద్ పవార్ గురించి సానుకూల అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ కలిసి.. త్వరలో ఇద్దరు నేతలు చేతులు కలిపినా ఆశ్చర్యం ఉండదు.