Advocates : లాయర్లపై కన్జ్యూమర్ కోర్టుల్లో దావాలు వేయకూడదు.. సుప్రీంకోర్టు తీర్పు
Advocates : న్యాయవాదులపై వినియోగదారుల న్యాయస్థానాలలో దావాలు వేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
- By Pasha Published Date - 01:28 PM, Tue - 14 May 24

Advocates : న్యాయవాదులపై వినియోగదారుల న్యాయస్థానాలలో దావాలు వేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లాయర్లు ఫీజు తీసుకొని కేసులు వాదిస్తుంటారని, దాన్ని వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద ‘సేవ’గా పరిగణించలేమని తెలిపింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం ఈమేరకు మంగళవారం తీర్పును వెలువరించింది. 2007 సంవత్సరంలో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు బెంచ్ తోసిపుచ్చింది. న్యాయవాదులు అందించే సేవలు వినియోగదారుల రక్షణ చట్టం 1986లోని సెక్షన్ 2 (ఓ) పరిధిలోకి వస్తాయని అప్పట్లో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీర్పు ఇచ్చింది.
We’re now on WhatsApp. Click to Join
‘‘వ్యాపారం, వాణిజ్యం వేరు.. వృత్తి వేరు.. వృత్తినిపుణుడి విజయంలో అతడి నియంత్రణలో లేని చాలా అంశాలు కలగలిసి ఉంటాయి’’ అని తీర్పులో సుప్రీంకోర్టు ప్రస్తావించింది. వ్యాపారవేత్తలతో సమానంగా న్యాయవాదుల(Advocates) వంటిని ప్రొఫెషనల్‌ని చూడలేమని న్యాయస్థానం పేర్కొంది. ‘‘వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం వైద్యులను బాధ్యులను చేయొచ్చని గతంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వర్సెస్ వీపీ శాంతన కేసులో తీర్పు వచ్చింది. దాన్ని పునస్సమీక్షించాల్సిన అవసరం ఉంది’’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ త్రివేది తెలిపారు.