Moaists Surrender: ఒక్కేసారి 71 మంది మావోయిస్టులు లొంగుబాటు – బస్తర్ చరిత్రలో అరుదైన ఘటన
లొంగిపోయిన వారిలో 50 మంది పురుషులు, 21 మంది మహిళలు ఉన్నారు. వీరంతా పాత మావోయిస్టు కార్యకలాపాల్లో కీలకంగా పాల్గొన్నవారు.
- By Dinesh Akula Published Date - 10:25 PM, Wed - 24 September 25

దంతెవాడ, ఛత్తీస్‌గఢ్: (Moaists Surrender)- ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై ప్రభుత్వం నడిపిస్తున్న భారీ ఆపరేషన్‌కు గట్టి ఫలితం దక్కింది. బస్తర్ ప్రాంతంలోని దంతెవాడ జిల్లాలో ఒకేసారి 71 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇందులో 64 లక్షల రూపాయల వరకు రివార్డులు ఉన్న 30 మంది మావోయిస్టులు ఉన్నట్టు జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు.
లొంగిపోయిన వారిలో 50 మంది పురుషులు, 21 మంది మహిళలు ఉన్నారు. వీరంతా పాత మావోయిస్టు కార్యకలాపాల్లో కీలకంగా పాల్గొన్నవారు. చెట్లు నరికి రోడ్లు మూసేయడం, బ్యానర్లు కట్టడం, కరపత్రాలు పంపిణీ చేయడం మాత్రమే కాదు, కొందరు పోలీసు స్టేషన్లపై దాడులు కూడా చేసినట్లు సమాచారం.
ఈ లొంగుబాటు చర్య “లోన్ వరరతు” అనే ఇంటికి తిరిగి రండి కార్యక్రమం ప్రభావంతో జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టంగా నక్సల్స్‌తో చర్చలు లేవని, లొంగిపోవాలంటూ చివరి హెచ్చరిక ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో పోలీస్ దళాలు మరింత చురుకుగా కూంబింగ్, ఎన్‌కౌంటర్‌లకు దిగాయి. ఇప్పటికే టాప్ కమాండర్లపై భారీ ఎన్‌కౌంటర్లు జరిపి, 9 మందిని మట్టుబెట్టారు.
ఈ నేపథ్యంలో టాప్ కమాండర్ సుజాత లొంగిపోవడం, ఇప్పుడు 71 మందికిపైగా ఒకేసారి లొంగిపోయిన ఘటన బస్తర్ నక్సలైట్ చరిత్రలోనే అతిపెద్ద విజయంగా నమోదు అయింది.
గత 19 నెలల్లో దంతెవాడలో లొంగిపోయిన మావోయిస్టుల సంఖ్య 461కి చేరింది. వారిలో 129 మందిపై భారీ రివార్డులు ఉన్నాయన్నది గమనించాల్సిన విషయం. లొంగుబాటు చేసిన మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం పునరావాస పథకం కింద ₹50,000 చొప్పున ఆర్థిక సాయం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, వ్యవసాయ భూముల కేటాయింపు వంటి ప్రయోజనాలు అందిస్తోంది.