Polluted Cities : ప్రపంచంలోనే 100 కాలుష్య నగరాల్లో… 63 ఇండియాలోనే..!
- By HashtagU Desk Published Date - 09:47 AM, Wed - 23 March 22

ప్రస్తుతం యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పర్యావరణ కాలుష్యం ఒకటి. రోజురోజుకీ పొల్యూషన్ లెవల్స్ పెరుగుతున్నాయే తప్ప, తగ్గని పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆయా దేశాలు తీసుకుంటున్న కాలుష్య నివారణ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మారుతున్న వాతావరణ మార్పులకు అనుగుణంగా చర్యలు లేవనేది శాస్త్రవేత్తల మాట. ఈ విషయంలో అన్ని దేశాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే భారతదేశం విషయానికొస్తే… ఇక్కడ కాలుష్య పరిస్థితులు ఏ మాత్రం మెరుగుపడట్లేదు సరికదా.. నానాటికీ అది మరింత దిగజారుతోంది.
ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ సహా నార్త్ ఇండియాలో పొల్యూషన్ లెవల్స్ ప్రమాదకరస్థాయికి చేరుకుంటున్నాయి. వరుసగా నాలుగో ఏడాది ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన రాజధానిగా ఢిల్లీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక గాలి నాణ్యత(Air Qualiy Index)ప్రమాదకరంగా ఉన్న తొలి 50 నగరాల్లో… మన దేశంలోనే 35 ఉండటం గమనార్హం. ఈ మేరకు స్విస్ సంస్థ ఐక్యూ ఎయిర్ విడుదల చేసిన ”ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2021” లో ఈ విషయాలను వెల్లడించింది. 2021లో ఇండియాలోని ఏ నగరమూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నిర్దేశించిన గాలి నాణ్యత ప్రమాణాలను చేరుకోలేకపోయిందని ఆ నివేదిక తెలిపింది.
48 శాతం నగరాల్లో అయితే డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాల కంటే, 10 రెట్లు కాలుష్యం అధికంగా ఉన్నట్లు పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో గతేడాదితో పోలిస్తే కాలుష్య స్థాయిలు 15 శాతం పెరిగినట్లు నివేదిక పేర్కొంది. ప్రపంచంలోనే తొలి 100 కాలుష్య నగరాల్లో 63 భారత్ లోనే ఉండటం గమనార్హం. అత్యంత కాలుష్య రాజధానుల జాబితాలో ఢిల్లీ తొలి స్థానంలో ఉండగా.. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా రెండో స్థానంలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో రాజస్థాన్ భీవాడి ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ రెండు, ఢీల్లీ నాలుగో స్థానంలో ఉన్నాయి.
ఈ జాబితాలో తొలి 15 నగరాల్లో 10 ఇండియాలోనివే కావడం గమనార్హం. ఇకపోతే చైనాలోని హోటన్ నగరం ఈ జాబితాలో మూడో స్థానంలో ఉండగా.. పాకిస్థాన్ కు చెందిన ఫైసలాబాద్, బహవల్‌పూర్, పెషావర్, లాహోర్ కాలుష్య నగరాల జాబితాలో ఉన్నట్లు నివేదిక స్విస్ సంస్థ నివేదిక వెల్లడించింది. ఇప్పటికైనా భారత్ కాలుష్యాన్ని నివారించే చర్యలు తీసుకోవల్సిందిగా సదరు సంస్థ సూచించింది. ఇక ఢిల్లీలో అయితే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సూచిని చూస్తేనే భయమేసే పరిస్థితి నెలకొంది. పర్యావరణ కాలుష్య నియంత్రణ విషయంలో… ఇప్పటికైనా ఆయా దేశాలు మేల్కొంటే తప్ప, రాబోయే ముప్పును ఆపలేము.