Maoists: గడ్చిరోలిలో భారీ ఎన్ కౌంటర్. 26 మంది మావోయిస్టులు హతం, మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యులు
మహారాష్ట్రలోని గడ్చిరోలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, జవాన్లకు ఎదురు కాల్పులు జరిగాయి.
- Author : Hashtag U
Date : 14-11-2021 - 12:10 IST
Published By : Hashtagu Telugu Desk
మహారాష్ట్రలోని గడ్చిరోలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, జవాన్లకు ఎదురు కాల్పులు జరిగాయి.
మహారాష్ట్ర పోలీస్ శాఖలోని సీ-60 విభాగానికి చెందిన క్రాక్ కమాండోస్ చేసిన ఈ ఆపరేషన్ లో ఇప్పటివరకు 26 మంది మావోలు మృతిచెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు కూడా గాయపడినట్లు గడ్చిరోలి జిల్లా ఎస్పీ వెల్లడించారు.

ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు తారసపడగా జవాన్లు, మావోయిస్టులు పరస్పరం ఎదురుకాల్పులు జరిపారు. దాదాపు పదిగంటల కాల్పుల అనంతరం ఘటనా స్థలిలో 26 మంది మావోయిస్టుల మృతదేహాలు, 16 తుపాకులు లభించినట్లు పోలీసులు తెలిపారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భీమా కోరేగావ్ అల్లర్ల కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మావోయిస్టు నేత మిలింద్ తెల్‌తుంబ్డే కూడా ఈ కాల్పుల్లో మరణించినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
Also Read: కాలుష్యంపై ఢిల్లీ ప్రభుత్వానికి సీజేఐ రమణ కీలక ఆదేశాలు…?
2017లో ఏవోబీలో జరిగిన ఎన్ కౌంటర్లో 25మంది మావోయిస్టులు చనిపోయారు. ఆ సంఘటన తర్వాత మళ్ళీ ఇదే మేజర్ ఎన్ కౌంటర్. ఇంతమందిని చంపారంటే ఇది ముమ్మాటికీ బూటకపు ఎన్ కౌంటర్ అని, ప్రభుత్వం ఇప్పటికైనా ఈ హింసను ఆపి మావోయిస్టులతో చర్చలు జరపాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: శభాష్ సంగీత : వ్యవసాయం చేస్తూ.. మహిళలకు ఆదర్శంగా నిలుస్తూ!