Anti Cheating Bill : అక్రమార్కులకు ఖబడ్దార్.. లోక్‌సభలోకి ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్’ బిల్లు
Anti Cheating Bill : పేపర్ లీకులు, మాస్ కాపీయింగ్ వంటి బాగోతాలు ఉద్యోగ పరీక్షలు, విద్యార్హత పరీక్షల్లో పెచ్చుమీరుతున్నాయి.
- By Pasha Published Date - 09:17 AM, Tue - 6 February 24

Anti Cheating Bill : పేపర్ లీకులు, మాస్ కాపీయింగ్ వంటి బాగోతాలు ఉద్యోగ పరీక్షలు, విద్యార్హత పరీక్షల్లో పెచ్చుమీరుతున్నాయి. తెలంగాణ, రాజస్థాన్, హర్యానా, గుజరాత్, బిహార్ సహా పలు రాష్ట్రాల్లో గతేడాది ఈవిధమైన వ్యవహారాలు దుమారం రేపాయి. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే అన్ని రకాల పరీక్షల్లో అవకతవకలకు చెక్ పెట్టేందుకు మోడీ సర్కారు నడుం బిగించింది. తాజాగా సోమవారం ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) బిల్లు-2024’ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును సభలోకి ఇంట్రడ్యూస్ చేశారు. లోక్‌సభ, రాజ్యసభల ఆమోదం పొంది ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే.. పేపరు లీకేజీకి పాల్పడినా, మాల్ ప్రాక్టీస్ చేసినా, నకిలీ వెబ్‌సైట్లను సృష్టించినా కనిష్ఠంగా మూడేళ్లు, గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్ష పడుతుంది. రూ.కోటి వరకూ జరిమానా విధిస్తారు. ఈ బిల్లు పోటీ పరీక్షల్లో అవతవకలను క్రియేట్ చేసే వ్యవస్థీకృత ముఠాలు, మాఫియాపై ఉక్కుపాదం మోపుతుంది. వారితో చేతులు కలిపిన ప్రభుత్వ అధికారులనూ శిక్షించే ప్రతిపాదనలు ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) బిల్లు-2024’లో( Anti Cheating Bill) ఉన్నాయి. ప్రస్తుతం ఈ నేరాలకు చట్టంలో ఎటువంటి శిక్షలు లేవు. కొత్త బిల్లు యూపీఎస్సీ, ఎస్సెస్సీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్, ఎన్‌టీఏ వంటి పోటీ పరీక్షలతోపాటు నీట్, జేఈఈ, సీయూఈటీ వంటి ప్రవేశ పరీక్షలకూ వర్తిస్తుంది.
We’re now on WhatsApp. Click to Join
బిల్లులోని ప్రపోజల్స్ ఇవీ..
- ప్రశ్నపత్రాలు, ఆన్సర్ షీట్ల లీకేజీలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనడం.. అభ్యర్థులకు నేరుగాగానీ, ఇతర మార్గాల ద్వారాగానీ సహకరించడం.. కంప్యూటర్ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్ చేయడాన్ని ఈ బిల్లులో శిక్షార్హమైన నేరంగా గుర్తించారు.
- నియామక సంస్థల పేరుతో నకిలీ వెబ్‌సైట్లను సృష్టించడం, నకిలీ పరీక్షలను నిర్వహించడం, నకిలీ అడ్మిట్ కార్డులను జారీ చేయడం, నకిలీ నియామక పత్రాలను ఇవ్వడం కూడా శిక్షార్హమైన నేరమే.
- పరీక్షల సమయంలో కొంతమందికి సీట్లను మార్చడం, పరీక్ష తేదీలను, షిఫ్టులను అనుకూలంగా మార్చడం కూడా శిక్షార్హమైన నేరమే.
- పరీక్షలలో అక్రమాలు జరిగితే.. వాటిని నిర్వహించే సంస్థ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాంటి సంస్థలకు రూ.కోటి వరకూ జరిమానా విధిస్తారు. అటువంటి సంస్థలను పరీక్షల నుంచి నాలుగేళ్లపాటు బ్యాన్ చేస్తారు.
- పేపర్ లీక్ కేసుల విచారణను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లేదా అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ స్థాయి కంటే తక్కువ లేని అధికారి నిర్వహించాల్సి ఉంటుంది.
- దర్యాప్తును ఏదైనా కేంద్ర ఏజెన్సీకి అప్పగించే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.
- ఈ బిల్లులో పేపర్ లీక్‌తో ముడిపడిన 20 రకాల నేరాలు, అక్రమాలకు పాల్పడే వారికి విధించాల్సిన శిక్షల గురించి ప్రస్తావించారు. మాస్ కాపీయింగ్, జవాబు పత్రాలను తారుమారు చేయడం, ఓఎంఆర్ షీట్లను ట్యాంపరింగ్ చేయడం వంటివన్నీ ఈ నేరాల జాబితాలో ఉన్నాయి.
- ఈ బిల్లును అన్ని పార్టీలు ఆమోదించే అవకాశం ఉంది. త్వరగానే చట్టంగా మారుతుందని పేపర్ లీకుల నుంచి రక్షణ లభిస్తుందని యువత ఆశిస్తోంది.