Vande Bharat Sleeper : పట్టాలెక్కబోతున్న వందే భారత్ స్లీపర్ తొలి ట్రైన్..
- By Sudheer Published Date - 06:08 PM, Tue - 6 February 24

వందే భారత్ ఎక్స్ప్రెస్ స్లీపర్ (Vande Bharat Sleeper) పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ సిద్ధం అవుతుంది. మార్చి నెల నుంచి ట్రయల్ రన్ చేపట్టనుండగా.. ఏప్రిల్లో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. తొలి రైలును ఢిల్లీ-ముంబయి మధ్య ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ రైలులో 16 నుంచి 20 కోచ్లు ఉంటాయి. రాత్రి వేళలో ఎక్కువ ప్రయాణదూరం ఉండే రూట్లలో ఈ స్లీపర్ ట్రైన్ ను నడపాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పటికే దేశవ్యాప్తంగా 39 వందే భారత్ చైర్ కార్ వెర్షన్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. వందే భారత్ స్లీపర్ రైలులో 16 ఏసీ 1-టైర్ కోచ్‌లు ఉంటాయని రైల్వే వర్గాలు తెలిపాయి. ఒక్కో రైలులో 850 బెర్తులు ఉంటాయని వెల్లడించారు. కొన్ని రైళ్లలో మరో 4 నాన్ ఏసీ స్లీపర్ కోచ్‌లు కూడా ఉండే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. సాధారణ రైళ్లతో పోలిస్తే ఈ రైళ్లు 2, 3 గంటలు త్వరగా గమ్యస్థానాన్ని చేరుకుంటాయని అధికారులు తెలిపారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్న మార్గాల్లో క్రమంగా వాటి స్థానంలో వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశ పెట్టనున్నారు. వీటితో దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. వందే భారత్ స్లీపర్ కోచ్‌లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో డిజైన్ చేశారు. ఈ రైళ్లు ఇప్పటివరకు ఇండియన్ రైల్వేలో ఉన్న సర్వీస్‌ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. వందే భారత్ స్లీపర్ రైళ్లలోనూ అత్యాధునిక కవచ్ రక్షణ వ్యవస్థ ఉంటుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇప్పటికే తెలిపారు. కొత్తగా తయారుచేస్తున్న కోచ్‌లన్నీ LHB (Linke Hofmann Busch) రకానివే. ఈ బోగీల్లో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
Read Also : MP Vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై జూబ్లీహిల్స్ లో కేసు నమోదు